GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ సమాచారం సంబంధిత ఉత్తర్వులతో:
సాధారణ భవిష్య నిధి (GPF) లో నిల్వయున్న మొత్తము నుండి కొంత మొత్తము శాశ్వతంగా,తిరిగి చెల్లించనవసరం లేని అడ్వాన్స్ లను "పార్ట్ ఫైనల్ " విత్ డ్రాయల్ అందురు.
GPF రూలు 15A(i) ప్రకారం 20 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినా లేక పదవీ విరమణ చేయడానికి 10 సంవత్సరాల సర్వీసు మిగిలియున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ పొందడానికి అర్హత కలిగియుంటాడు.
గృహ సంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ మొత్తం పొందడానికి అర్హత కలదు.
రూలు 15(A)(1)(C) ప్రకారం అనారోగ్య కారణముల వల్ల కూడా పార్ట్ ఫైనల్ మొత్తం పొందవచ్చు.
పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చు.
G.O.Ms.No.98 తేది: 19.6.1992
ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లకు మించరాదు మరియు ఒక అడ్వాన్సుకు మరొక అడ్వాన్సుకు మధ్య ఆరు నెలల వ్యవధి తప్పక ఉండాలి. రూలు 15-B Note-1
పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కి ఎలాంటి రికవరీ ఉండదు.
వివిధ సందర్భాలలో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ ఎంత మొత్తం మంజూరు చేయాలి అను విషయాలు ఈ క్రింద తెలిపిన రూల్స్ లో వివరించడం జరిగింది.
⏩ విద్యకై ఖర్చు 15B
⏩ వైద్య ఖర్చు 15C
⏩ వివాహ సంబంధ కార్యక్రమాలు 15D
⏩ గృహ కొనుగోలు 15E
⏩ ఇంటిస్థలం కొనుగోలు 15F
⏩ ఇంటి నిర్మాణం 15G
⏩ వ్యాపార సంబంధ,భూములు 15H
⏩ మోటారు కారు కొనుగోలు 15I
GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును అపెండిక్స్-O లో సమర్పించాలి.
బూస్టర్ స్కీం:
రూలు 30(A) ప్రకారం GPF చందాదారుడు ఆకస్మికంగా మరణించిన సందర్భంలో అదనపు ప్రయోజనంగా మరణానికి 3 సంవత్సరాల ముందు తన ఖాతాలో గజిటెడ్ వారికి రూ.8,000 బ్యాలెన్స్, నాన్ గజిటెడ్ వారికి రూ.6,000, లాస్ట్ గ్రేడ్ వారికి రూ.2,000 కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి వారికి G.O.Ms.No.42 F&P తేది: 29.1.2003 ప్రకారం సరాసరి నెల విలువకు రెండింతల మొత్తం రూ.20,000 మించకుండా చెల్లిస్తారు.
చనిపోయే రోజు వరకు ఉద్యోగి కనీసం 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి.
పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్-మంజూరు అధికారం:
NGO లందరికీ డ్రాయింగ్ అధికారి మంజూరు చేయవచ్చును. అయితే డ్రాయింగ్ అధికారి గజిటెడ్ కానిచో ఉన్న గజిటెడ్ అధికారి మంజూరు చేస్తాడు. అయితే ఒకరికన్నా ఎక్కువ గజిటెడ్ అధికారులు ఉన్నచో ఆ కార్యాలయపు అధికారి ఇతర గజిటెడ్ అధికారులందరికీ మంజూరు చేస్తారు.
ఉపాధ్యాయులకు:
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేయ ఉపాధ్యాయులకు PGHM లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేయు ఉపాధ్యాయులకు MEO లు, PGHM లకు జిల్లా విద్యాధికారులు మంజురు చేస్తారు. G.O.Ms.No.447 తేది: 28.11.2013 ప్రకారం ముఖ్యకార్యనిర్వాహణ అధికారి, జిల్లాపరిషత్ గారికి దరఖాస్తు పంపి సదరు సొమ్ము డ్రా చేసి సంబంధిత ఉపాధ్యాయుల బ్యాంకు అకౌంట్లలో జమచేస్తారు. మంజూరు ఉత్తర్వులతో పాటు Form-40 ని జతచేయాలి.
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి జిల్లాపరిషత్ ఉపకార్య నిర్వాహణాధికారి ఈ లోన్ ను మంజూరు చేస్తారు.