సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?
★ సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
★ అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం *G.O.Ms.No.202 F&P తేది:11.06.1980* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
★ ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
★ ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.
★ అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర(Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి *G.O.Ms.No.224 F &P తేది:28.8.1982*
★ పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
★ ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
★ పుట్టినతేది,విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.
★ ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.