గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా దేశవ్యాప్తంగా సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది భారతదేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఈ సందర్భంగా ఈరోజు వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటో మరోసారి తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశంలో గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2023వ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం దేశం తన 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1947లో బ్రిటీష్ రాజ్యం నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ అప్పటికి సొంత రాజ్యాంగం లేదు. భారతదేశం తన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న పొందింది. ఆ రోజునుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీనితో భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారింది. ఇది రిపబ్లిక్‌గా ప్రకటించారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం.
కాగా.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.
1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము "సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర" రాజ్యంగా అవతరించబడింది.
వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. ఆ తర్వాత రెండు నెలలకు దీన్ని అమల్లోకి తేవడంతోలాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకున్నారు. అయితే ఇంతలోనే జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా జాతీయ నేతలను ఉలిక్కిపడేలా చేసింది.
ఆ తర్వాత జరిగిన పరిణామాలు, భారత పౌరులు దేశంలో తలెత్తుకుని తిరిగే విధంగా నవభారత నిర్మాతలు రూపొందించిన రాజ్యాంగాని తగిన గౌరవం అందించేందుకు 1949 నవంబర్ 26 తర్వాత మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో నాటి నుంచి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దుకాబడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం: 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది.
రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది.
భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు.
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది.
మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్ లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి.
మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది. తొలి గణతంత్ర దినోత్సవం రాజ్ పథ్ లో కాకుండా ఇర్విన్ స్టేడియంలో అంటే ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారట.
1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్ర్య దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేచ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు.
ప్రభుత్వం 2023 రిపబ్లిక్ డే పరేడ్ లో వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన కోసం మూడు నిర్దిష్ట థీమ్ లను ప్రతిపాదించింది. అవి ఇండియా 75, అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం, నారీశక్తి రాష్ట్రాల శకటాలు.. ఈ మూడు థీమ్ లలో ఒకటి ఎంచుకునే అవకాశముంది. లేదా మూడింటిని కూడా ఎంచుకోవచ్చు.