top of page

సుకన్య సమృద్ధి యోజన ఖాతా గురించి 20 సందేహాలు – సమాధానాలు ఇవే


సుకన్య సమృద్ధి యోజన.. ఆడపిల్లల భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ఇది. 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ ఆడపిల్లల భవిష్యత్ (ఉన్నత చదువులు, వివాహం) కోసం డబ్బు సమకూర్చుకోవచ్చు. ప్రస్తుతం వార్షికంగా 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. కాబట్టి కాంపౌండింగ్ ప్రభావంతో రిస్క్ లేకుండా ద్రవ్యోల్బణానికి మించి రాబడి పొందవచ్చు.


ఈ పథకం గురించి పెట్టుబడిదారులకు తరచూ వచ్చే కొన్ని సందేహాలకు సమాధానాలు ఇవే


ప్రశ్న..1: బాలిక పేరుపై ఎస్‌.ఎస్.వై ఖాతాను ఎవరు తెరవచ్చు?


సమాధానం: 10 ఏళ్ల లోపు వయసు గల బాలిక పేరుపై ఆమె తల్లి లేదా తండ్రి లేదా చట్టపరమైన గార్డియన్ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవచ్చు.


ప్రశ్న..2: ఎస్‌.ఎస్.వై ఖాతాను ఎక్కడ తెరవాలి?


సమాధానం: మీ దగ్గరలోని పోస్టాఫీసులో గానీ.. అధీకృత బ్యాంకులో గానీ తెరవచ్చు.


ప్రశ్న.. 3: భారత్ లో ఎక్కడైనా ఎస్‌.ఎస్.వై ఖాతాను తెరవచ్చా?


సమాధానం: తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన పథకం. అందువల్ల ఇది భారత్ లోని ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో అందుబాటులో ఉంది.


ప్రశ్న... 4: ఎస్ఎస్ వై ఖాతా కాలపరిమితి ఎంత?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతాకు 21 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. అంటే, పాపకు 8 ఏళ్ల వయసున్నప్పుడు ఖాతాను ప్రారంభిస్తే 29 ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది.


ప్రశ్న.. 5: ఎస్‌.ఎస్.వై ఖాతాలో మెచ్యూరిటీ వరకు పెట్టుబడులు పెట్టాలా?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతాకు 21 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉన్నప్పటికీ, ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాల పాటు పెట్టుబడులు పెడితే సరిపోతుంది.


ప్రశ్న.. 6: మెచ్యూరిటీకి ముందే ఎస్‌.ఎస్.వై నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చా?


సమాధానం: లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప.. పాపకు 18 సంవత్సరాలు నిండక ముందు, ముందస్తు విత్ డ్రాలను అనుమితించరు. బాలికకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత విద్య, వివాహం వంటి కారణాలతో 50 శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.


ప్రశ్న.. 7: ఏయే సందర్భాల్లో ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు?


సమాధానం: ఈ కింది సందర్భాల్లో ఖాతా తెరిచిన 5 సంవత్సరాల తర్వాత ఖాతాను పూర్తిగా మూసివేయవచ్చు.

* ఏదైనా అనుకోని కారణాల చేత ఖాతాదారు మరణిస్తే వెంటనే మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఖాతాను మూసివేయవచ్చు.

* ఖాతాదారు ప్రాణాంతక వ్యాధుల బారిన పడినప్పుడు,

* ఖాతా నిర్వహిస్తున్న గార్డియన్ మరణించినప్పుడు,

పై సందర్భాల్లో ఖాతాను మూసివేయాలనుకుంటే.. దరఖాస్తు ఫారంతో పాటు, పాస్ బుక్, ఇతర కావాల్సిన అన్ని పత్రాలను ఖాతా ఉన్న పోస్టాఫీసు/ బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.

• ఖాతాదారులకి 18 సంవత్సరాల వయస్సు పూర్తయి, ఆమెకు వివాహం జరిగినట్లయితే ముందస్తు మూసివేతకు అవకాశం ఉంటుంది. వివాహానికి ఒక నెల ముందు లేదా మూడు నెలల తర్వాత ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చాక ఖాతాను పూర్తిగా ముగించవచ్చు.


ప్రశ్న.. 8: ఒక వ్యక్తి ఎన్ని ఎస్‌.ఎస్.వై ఖాతాలు తెరవచ్చు?


సమాధానం: ఒక ఆడపిల్ల పేరుపై ఒక ఖాతాను తెరిచే వీలుంది. కాబట్టి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారు వారి ఇద్దరి పిల్లల పేరుపై ఒక్కో ఖాతా చొప్పున రెండు ఖాతాలు తెరవచ్చు. ఒకవేళ మొదటి సంతానం ఆడపిల్ల అయివుండి రెండోసారి ఇద్దరు ఆడపిల్లలు (కవలలుగా) జన్మించినట్లయితే అప్పుడు మూడో ఖాతాను కూడా తెరవచ్చు.


ప్రశ్న.. 9: పాప పేరుతో ఎస్ఎస్ వై ఖాతా ప్రారంభించిన వ్యక్తి మరణిస్తే?


సమాధానం: ఒకవేళ పాప పేరుతో ఎస్‌.ఎస్.వై లో పెట్టుబడి పెడతున్న వ్యక్తి (తల్లి లేదా తండ్రి లేదా చట్టపరమైన గార్డియన్) మరణిస్తే ఖాతాను మూసివేయవచ్చు. లేదా పాప కుటుంబంలోని వేరొక వ్యక్తి ఖాతా భాద్యత తీసుకోవచ్చు. లేదా ఖాతాలో అప్పటి వరకు జమైన మొత్తంతో పాపకు 21 ఏళ్లు వచ్చే వరకు ఖాతా కొనసాగించవచ్చు. ఖాతాను కొనసాగించినంతకాలం ఖాతాలో జమైన మొత్తంపై వడ్డీ వస్తుంది.


ప్రశ్న.. 10: సాధారణ బ్యాంకు ఖాతాను ఎస్‌.ఎస్.వై ఖాతాగా మార్చుకోవచ్చా?


సమాధానం: లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో లేదు. సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల ఆర్థిక స్థితిని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకం. అందువల్ల దీన్ని ప్రత్యేకంగా తెరవాల్సి ఉంటుంది.


ప్రశ్న.. 11: ఖాతాను ఒక చోటి నుంచి మరొక చోటుకు బదిలీ చేసుకోవచ్చా?


సమాధానం: ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు. పోస్టాఫీసులో ఒక బ్రాంచి నుంచి మరొక బ్రాంచికి గానీ, పోస్టాఫీసు నుంచి అధీకృత బ్యాంకుకు గానీ, బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు గానీ, ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు గానీ బదిలీ చేసుకోవచ్చు. బాలికలు వారి చదువుల కోసం లేదా ఇతర కారణాల వల్ల ఒక చోటి నుంచి మరొక చోటికి మారే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు.


ప్రశ్న.. 12: ఖాతా పెట్టుబడులు పెట్టేందుకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఎంత?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతాలో ఖాతా నిర్వహణ కోసం ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.


ప్రశ్న.. 13: పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలా?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతాలో ఒక ఏడాదికి అనుమితించిన గరిష్ఠ పరిమితులకు లోబడి ఎన్ని సార్లైనా డబ్బు డిపాజిట్ చేయవచ్చు.


ప్రశ్న.. 14: గరిష్ఠ పరిమితి మించి డిపాజిట్ చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఆ మొత్తంపై వడ్డీ వర్తిస్తుందా?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతాలో అనుమితించిన గరిష్ట పరిమితిని మించి డిపాజిట్ చేసినా.. అదనపు మొత్తంపై వడ్డీ వర్తించదు. అలాగే, అదనపు మొత్తంపై పన్ను ప్రయోజనాలు వర్తించవు.


ప్రశ్న.. 15: కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే..?


సమాధానం: సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయడంలో విఫలం అయితే రూ.50 జరిమానా విధిస్తారు.


ప్రశ్న.. 16: ఎస్‌.ఎస్.వై ఖాతా నుంచి రుణం తీసుకోవచ్చా?


సమాధానం: లేదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసిన మొత్తం నుంచి రుణం తీసుకునే వెసులుబాటు లేదు.


ప్రశ్న.. 17: ఎన్నారైలు ఎస్‌.ఎస్.వై ఖాతాను తెరవచ్చా?


సమాధానం: ఎన్నారైలు భారతదేశం వెలుపల నివసిస్తున్నంత వరకు ఎస్‌.ఎస్.వై ఖాతా తెరిచేందుకు వీలుండదు. ఒకసారి భారతదేశం వచ్చి స్థిరపడిన తర్వాత ఖాతాను తెరవచ్చు.


ప్రశ్న.. 18: ఇప్పటికే ఎస్‌.ఎస్.వై ఖాతా ఉన్నవారు విదేశాలకు వెళ్లిన తర్వాత ఖాతా కొనసాగించవచ్చా?


సమాధానం: బాలికకు భారతీయ పౌరసత్వం ఉన్నంతవరకు ఖాతాను కొనసాగించవచ్చు. ఎన్నారైగా మారితే ఖాతాను రద్దు చేస్తారు.


ప్రశ్న.. 19: ఎస్‌.ఎస్.వై ఖాతాపై ఎంత వరకు పన్ను ప్రయోజనం లభిస్తుంది?


సమాధానం: సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సి కింద ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు.


ప్రశ్న..20: సుకన్య సమృద్ధి ఖాతా నుంచి వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుందా?


సమాధానం: ఎస్‌.ఎస్.వై ఖాతా పై 'ఈఈఈ' పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తం, ఆర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page