top of page
Writer's pictureAPTEACHERS

ITరిటర్నుల్లో తప్పులా...సరిచేసుకోండి

💥రిటర్నుల్లో తప్పులా...సరిచేసుకోండి💥 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసి, రిఫండు కోసం ఎదురు చూస్తున్నారా? దీనికన్నా ముందు మీరు చేయాల్సిన విషయం ఒకటుంది.. మీ ఈమెయిల్, ఫోన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏదైనా సందేశం వచ్చిందా గమనించండి. ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లండి. మీరు సమర్పించిన రిటర్నులను ‘ప్రాసెస్‌’ చేశారా? రిటర్నులలో ఏదైనా పొరపాటు దొర్లిందా? నోటీసులాంటివి వచ్చాయా? పరిశీలించండి. ఒకవేళ నోటీసు వచ్చినా.. ఆందోళన చెందకండి. రివైజ్డ్‌ రిటర్న్‌ దాఖలు చేస్తే సరిపోతుంది .. గత ఆర్థిక సంవత్సరానికి (2018-2019) సంబంధించిన రిటర్నులు దాఖలు చేయడానికి ఆగస్టు 31తో గడువు ముగిసింది. ఇప్పటికీ రిటర్నులు సమర్పించే అవకాశం ఉన్నప్పటికీ.. రుసుము కింద రూ.1,000 చెల్లించాలి. ఈసారి రిటర్నుల పత్రంలో చాలా మార్పులు ఉన్నాయి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో అంకెలను వేసేప్పుడు పొరపాట్లు దొర్లే అవకాశాలు పెరిగాయి. ఆదాయాలను సరిగా నమోదు చేయకపోవడం, ఆయా సెక్షన్ల కింద పొరపాటుగా అధిక మొత్తాలను వేయడంలాంటివి ప్రధానంగా ఉంటాయి. ఇలా పొరపాట్లు చేసినప్పుడు ఏం చేయాలి? ఆదాయపు పన్ను శాఖ.. ఇలాంటి తప్పులను సరిదిద్దుకునేందుకు ‘రివైజ్డ్‌ రిటర్న్‌’ సమర్పించే వీలును కల్పిస్తోంది. తప్పులు వచ్చాయని అనుకుంటే.. సాధ్యమైనంత తొందరగా ఈ రిటర్నులు సమర్పించడం మేలు. ఏయే సందర్భాల్లో.. గడువులోపు దాఖలు చేసిన రిటర్నులలో తెలియకుండా ఏవైౖనా పొరపాట్లను నమోదు చేస్తే.. వాటిని రివైజ్డ్‌ రిటర్నులలో సరిచేయవచ్చు. మొదట వేసిన రిటర్నులకు దీనికీ తేడా ఏమీ ఉండదు. కేవలం ‘రివైజ్డ్‌ రిటర్న్‌’ అని పేర్కొంటూ.. అసలు రిటర్న్‌కు సంబంధించిన రశీదు సంఖ్య, తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పులు చేశారో.. అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. > ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతోపాటు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతా ద్వారా వచ్చిన వడ్డీలు, అద్దె ఆదాయంలాంటి వాటితో పాటు.. ఇతర పెట్టుబడులపై వచ్చిన రాబడులనూ తెలియజేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పేర్కొనకపోతే.. రిటర్నులను ఆమోదించకుండా తిరస్కరించే వీలుంది. ఇలాంటప్పుడు తిరిగి రిటర్నులు దాఖలు చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేవలం మీ ఉద్యోగ సంస్థ ఇచ్చిన 26ఏఎస్‌నే కాకుండా.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటు నుంచీ 26ఏఎస్‌ను తీసుకోండి.. ఇందులో అన్ని వివరాలూ ఉంటాయి. > కొన్నిసార్లు పొరపాటున మనం క్లెయిం చేసుకోవాల్సిన మొత్తాలను ఆయా సెక్షన్ల కింద నమోదు చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు పన్ను అధికంగా చెల్లించడమో.. రావాల్సిన రిఫండు రాకపోవడంలాంటి పరిస్థితి వస్తుంది. దీన్ని గుర్తించినప్పుడూ తిరిగి కొత్తగా రిటర్నులు దాఖలు చేయొచ్చు. > బ్యాంకు ఖాతా వివరాలు.. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఖాతా సంఖ్యలో ఏదైనా తప్పు దొర్లితే.. రిఫండు జమ కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని గుర్తించిన వెంటనే.. రివైజ్డ్‌ రిటర్నులో సరి చేసుకోవాలి. ఎవరు దాఖలు చేయాలి? రిటర్నులలో తప్పులు దొర్లాయని అనుకున్న వారెవరైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139(5) ప్రకారం ఈ రివైజ్డ్‌ రిటర్నులను వేయొచ్చు. గతంలో కేవలం వ్యవధి లోపు రిటర్నులు దాఖలు చేసిన వారికే దీని అనుమతి ఉండేది. ఇప్పుడు వ్యవధి తర్వాత చేసిన వారికీ రివైజ్డ్‌కు అనుమతిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులలో తప్పులను సరిచేసుకునేందుకు మార్చి 31, 2020 దాకా సమయం ఉంది. ఒకసారి ‘ఒరిజినల్‌’ రిటర్నులను దాఖలు చేశాక.. ఎన్నిసార్లైనా దాన్ని మార్చుకునేందుకు వీలుంది. అంతమాత్రాన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయొద్దు. వెరిఫై చేశారా? రిటర్నులను దాఖలు చేసిన వారు తప్పనిసరిగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ఆ రిటర్నులు అధీకృతం అవుతాయి. లేకపోతే దానికి విలువ ఉండదు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత 120 రోజుల్లోగా దీన్ని పూర్తి చేయొచ్చు. ఆధార్‌ ఓటీపీ, బ్యాంక్‌ ఆన్‌లైన్‌ ఖాతా ద్వారా, ఈవీసీ తదితరాల ద్వారా ఈ-వెరిఫై చేయొచ్చు. లేదా రశీదుపై సంతకం చేసి సీపీసీ, బెంగళూరుకు పోస్ట్‌లో పంపించాలి. రిఫండు ఎప్పుడొస్తుంది? మీరు సమర్పించిన రిటర్ను అంతా సవ్యంగా ఉండి, మీరు రిఫండు కోరినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది మీ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. దీనికి ముందుగా మీ రిటర్నులను అనుమతించినట్లు (ప్రాసెస్‌)ఆదాయపు పన్ను శాఖ సమాచారాన్ని పంపిస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత రిఫండు కోరారు, వాస్తవంగా ఎంత వస్తుంది అనే గణాంకాలతో ఒక సమాచారం వస్తుంది. ఆ తర్వాతే మీకు రిఫండును పంపిస్తారు. మీకు అనుమానం ఉంటే.. ఒకసారి ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైటులోకి లాగినై, ‘వర్క్‌లిస్ట్‌’లో ‘ఫర్‌ యువర్‌ యాక్షన్‌’ను చూడండి. ఏదైనా నోటీసుల్లాంటివి ఉంటే అక్కడ తెలుస్తుంది. వీటికి స్పందించకండి.. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం వచ్చినట్లుగా మోసపూరిత మెయిళ్లూ వస్తుంటాయి. రిఫండును జమ చేసేందుకు మీ ఖాతా వివరాలు సరిగా లేవంటూ ఇందులో పేర్కొంటుంటారు. ఇలాంటి వాటిని ఎప్పుడూ నమ్మొద్దు. ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చే ఏ సమాచారమైనా.. DONOTREPLY @incometaxindiaefiling.gov.in నుంచే వస్తుంది గుర్తుంచుకోండి.. ఆదాయపు పన్ను శాఖ మీ నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్నీ నేరుగా ఈ మెయిల్‌ ద్వారా అడగదు. ఏదైనా కావాలనుకుంటే.. ఈఫైలింగ్‌ వెబ్‌సైటులోనే చెబుతుంది. జవాబునూ అక్కడే నమోదు చేయాలి.

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page