top of page
Writer's pictureAPTEACHERS

అశుతోష్‌ మిశ్ర కమిటీ స్పష్టీకరణ

అశుతోష్‌ మిశ్ర కమిటీ స్పష్టీకరణ ఉద్యోగులకు 27% ఫిట్‌మెంట్‌ సిఫారసు

ప్రభుత్వ ఉద్యోగులకు అశుతోష్‌ మిశ్ర కమిటీ చేసిన చేసిన సిఫారసులన్నీ యథాతథంగా అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3,181 కోట్ల భారమే పడుతుంది. ఈ విషయాన్ని ఆ కమిటీయే స్పష్టం చేసింది. ఉద్యోగులకు 27% ఫిట్‌మెంట్‌ ఇస్తూ, ఇప్పుడున్న ఇంటి అద్దె భత్యాల్ని తగ్గించకుండా, సీసీఏని కొనసాగిస్తూ, మరిన్ని వెసులుబాట్లు, ప్రయోజనాలు కల్పిస్తూ చేసిన సిఫారసుల్ని పూర్తిగా అమలుచేసినా ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థికభారం రూ.3,181 కోట్లేనని కమిటీ పేర్కొంది. ఇప్పటివరకూ ఉన్న ఇంటి అద్దె భత్యాల్ని కొనసాగిస్తూ, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పనిచేసేవారికి 22% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలంటూ కొత్త కేటగిరీని ప్రతిపాదించింది. ఆరు వాల్యూములుగా ఉన్న అశుతోష్‌మిశ్ర కమిటీ నివేదికను ప్రభుత్వం శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేసినా, ప్రభుత్వం ఇప్పటివరకూ గోప్యంగా ఉంచింది. వారికి ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ వంటివన్నీ ఖరారు చేశాక, ఇప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచింది. వారు చెప్పినదాని కంటే తక్కువే! రాష్ట్రప్రభుత్వం అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయకుండా, దానిపై సీఎస్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. సీఎస్‌ కమిటీ సిఫారసుల ఆధారంగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 23%గా నిర్ణయించింది. హెచ్‌ఆర్‌ఏనూ తగ్గించింది. సీసీఏని తీసేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో.. ఫిట్‌మెంట్‌ పెంచకుండా, హెచ్‌ఆర్‌ఏను కొంత పెంచేందుకు, సీసీఏని కొనసాగించేందుకు అంగీకరించింది. అవి అమలు చేసినందుకే ప్రభుత్వంపై కొన్ని వేలకోట్ల అదనపు భారం పడుతుందని సీఎస్‌ సమీర్‌శర్మ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ అశుతోష్‌ మిశ్ర కమిటీ వేసిన అంచనా, వారు చెబుతున్న దానికంటే బాగా తక్కువగా ఉండటం గమనార్హం. నివేదికలోని ముఖ్యాంశాలివీ..! కనీస వేతనం రూ.20 వేలు వేతన స్కేళ్లు: 32 గ్రేడులు, 83 స్టేజీలతో మాస్టర్‌ స్కేళ్లు. గతంలో 81గా ఉన్న స్టేజీల సంఖ్య 83కి పెంపు. వార్షిక ఇంక్రిమెంట్‌ తొలి స్టేజీల్లో 3% నుంచి మొదలుపెట్టి 2.34%తో ముగిసేలా సిఫార్సు. కనీస వేతనం రూ.20వేలు చెల్లించాలి. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఉండాలి. ⭕ఫిట్‌మెంట్‌: మూలవేతనంపై 27% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. కొత్త వేతనస్కేళ్లు అమల్లోకి వచ్చే తేదీ: 2018 జులై 1 నుంచి కొత్త వేతనస్కేళ్లు అమల్లోకి రావాలి. ఆర్థికలబ్ధి ఎప్పటి నుంచి ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయించవచ్చు. ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ): రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు: మూలవేతనంపై 30%, నెలకు రూ.26 వేలకు మించకుండా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు: మూలవేతనంపై 22%, నెలకు రూ.22,500 మించకుండా 2-10 లక్షలు జనాభా కలిగిన నగరాల్లో పనిచేసే వారికి: మూలవేతనంపై 20%, నెలకు రూ.20,000 మించకుండా 50 వేలు-2 లక్షల లోపు జనాభా కలిగి నగరాల్లో ఉద్యోగులకు: మూలవేతనంపై 14.5%, నెలకు రూ.20,000 మించకుండా మిగతా ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు: మూలవేతనంపై 12%, నెలకు రూ.17,000 మించకుండా ♦సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌ (సీసీఏ): సీసీఏలో రెండు శ్లాబులు సిఫార్సు. విజయవాడ, విశాఖపట్నాల్లో పనిచేసే ఉద్యోగులకు ఒక శ్లాబు. మిగతా 12 నగరపాలక సంస్థల పరిధిలో పనిచేసే ఉద్యోగులకు మరో శ్లాబు. విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థల్లో పనిచేసేవారికి రూ.400-1,000, ఇతర నగరపాలక సంస్థల్లో పనిచేసేవారికి రూ.300-రూ.750 మధ్య సీసీఏ చెల్లించేలా సిఫార్సు అడ్వాన్సు ఇంక్రిమెంట్లు: ఉన్నత లేదా అధిక విద్యార్హతలు కలిగి ఉన్నారనే కారణంతో ఎవరికీ ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వొద్దు. కరువు భత్యం ప్రస్తుతం ఉన్నట్లే కొనసాగించాలి. రెగ్యులర్‌ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయకూడదు ప్రతి ప్రభుత్వ విభాగం ఉద్యోగ నియామక ప్రణాళిక రూపొందించుకుని, ఏటా దాన్ని అప్‌డేట్‌ చేయాలి. అధికారులు, సిబ్బందికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు.. పదవీ విరమణలు, పదోన్నతుల వల్ల భవిష్యత్తులో రాబోయే ఖాళీల వివరాల్ని దానిలో పొందుపరచాలి. ఖాళీల్ని ఏపీపీఎస్సీ/డీఎస్సీల ద్వారా గానీ, కాంట్రాక్ట్‌ పద్ధతిలో గానీ దశలవారీగా భర్తీ చేయాలి. భవిష్యత్తులో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటైన పోస్టులనే కాంట్రాక్టు విధానంలో భర్తీచేయాలి. శాశ్వత పోస్టులను ఆ పద్ధతిలో భర్తీ చేయకూడదు. ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా, పోటీవిధానంలో నియమించిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హతలున్న వారి సర్వీసును... భవిష్యత్తులో శాశ్వత పోస్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు క్రమబద్ధీకరించాలి. క్లీనింగ్‌, మెయింటెనెన్స్‌, సెక్యూరిటీ, బిల్‌ కలెక్షన్‌, రిసెప్షన్‌ డెస్క్‌ల నిర్వహణ, డ్రైవర్లు వంటి పోస్టులనే పొరుగుసేవల ఉద్యోగుల ద్వారా భర్తీచేయాలి. ఈ సర్వీసులను టెండరు విధానంలో అవుట్‌సోర్సింగ్‌ సంస్థలకు అప్పగించాలి. భవిష్యత్తులో ఏ వ్యక్తినీ నేరుగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా నియమించకూడదు. వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. విభాగాలవారీగా ఎవరెవరికి, ఏ అంశాల్లో శిక్షణ అవసరమో గుర్తించి, శిక్షణ ఇవ్వాలి. దీనికి అవసరమైన నిధుల్ని ప్రభుత్వం సమకూర్చాలి. అన్ని ప్రభుత్వ విభాగాల సర్వీసు నిబంధనల్ని సమీక్షించేందుకు సాధారణ పరిపాలన విభాగం ఒక కమిటీని నియమించాలి. ఆ కమిటీ... ఆయా విభాగాధిపతులతో సంప్రదించాక సర్వీసు నిబంధనల్లో చేయాల్సిన మార్పుచేర్పులపై సూచనలు చేయాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యనిర్వాహక సిబ్బందికి సీయూజీ ఫోన్లు అందజేయాలి. ప్రభుత్వం నుంచి నేరుగా పౌరులకు (జీ టూ సీ) అందే సేవలను మీ-సేవ ద్వారా అందజేయాలి. గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.16 లక్షలకు పెంచాలి 27% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. పెన్షన్‌, కుటుంబపెన్షన్‌ స్థిరీకరణలో మార్పులేమీ లేవు. అయిదేళ్ల సర్వీస్‌ వెయిటేజితో అర్హత సాధించిన 33 ఏళ్ల తర్వాత ప్రస్తుత పూర్తి పెన్షన్‌ ప్రొవిజన్‌ కొనసాగించాలి. 70 ఏళ్ల ప్రారంభం నుంచి అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇచ్చేలా సవరించాలి. ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే.. ఆయనపై ఆధారపడిన వారికి.. గరిష్ఠ వయోపరిమితి లేకుండా పదేళ్ల వరకూ పెంచిన ఫ్యామిలీ పెన్షన్‌ చెల్లించాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణిస్తే.. ఏడేళ్లు లేదా 67 ఏళ్లు వచ్చే వరకూ పెంచిన ఫ్యామిలీ పెన్షన్‌ చెల్లించాలి. కుటుంబపెన్షనర్లలో అవివాహితులు, వితంతువులు, విడాకులు తీసుకున్న కుమార్తెకు 45 ఏళ్ల షరతుల కింద.. వారి పిల్లలకు 25 ఏళ్లు నిండి సంపాదించడం ప్రారంభమయ్యే వరకూ మినహాయింపు ఇవ్వాలి. ప్రాథమిక పెన్షన్‌లలో డియర్‌నెస్‌ రిలీఫ్‌ అనుమతించాలి. కనీస పెన్షన్‌/కుటుంబ పెన్షన్‌ను రూ.10వేలకు పెంచాలి. పదవీవిరమణ సమయంలో చెల్లించాల్సిన గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలి. సర్వీసు, కుటుంబ పెన్షనర్‌ మరణించినప్పుడు ఇచ్చే ఆర్థికసాయాన్ని రూ.20వేలకు పెంచాలి. 1.7.2018 తర్వాత.. కనీస సేవా పెన్షన్‌, కుటుంబ పెన్షన్‌ను (నెలకు రూ.10వేలను) డీఆర్‌తో కలిపి ఆర్థిక సాయంగా అందించాలి. ప్రాథమిక పెన్షన్‌లో భాగంగా 40% కమ్యుటేషన్‌పై ఉన్న సీలింగ్‌ పరిమితి.. 15 ఏళ్ల తర్వాత పెన్షన్‌ కమ్యుటెడ్‌ భాగాన్ని పునరుద్ధరించడానికి వీలుగా ఉండాలి. ప్రవేశస్థాయి, సేవా నిబంధనలకు అనుగుణంగా వర్క్‌ఛార్జి ఎస్టాబ్లిష్‌మెంట్‌ వేతన స్కేళ్లను హేతుబద్ధీకరించాలి. ఒప్పంద, పూర్తి సమయ కాంటింజెంట్‌ ఉద్యోగులకు నెలకు రూ.20వేలు, డీఏ 2015 ఆర్‌పీఎస్‌లో నెలకు రూ.13 వేలు, డీఏ వేతనం తీసుకుంటున్న క్రమబద్ధీకరించని ఫుల్‌టైమ్‌ కాంటింజెంట్‌/దినసరి వేతన/కన్సాలిడేటెడ్‌ పే/ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులకు.. నెలకు రూ.20వేలు+డీఏ చొప్పున వేతనంగా చెల్లించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా.. సవరించిన వేతన స్కేల్‌ను అమలుచేయాలి. ♦ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ పథకం నిర్దిష్టపోస్టులో ఒక ఉద్యోగి 30 ఏళ్లు పనిచేస్తే ఎస్‌పీపీ స్కేల్‌ 2ఎ/ఎస్‌ఏపీపీ స్కేల్‌ 2ఎలో ఒక ఇంక్రిమెంట్‌ మంజూరుచేయాలి. బోధనేతర మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు సెలవులు బోధన మహిళ ఉద్యోగులతో సమానంగా బోధనేతర మహిళ ఉద్యోగులకు అదనంగా ఐదు రోజులు క్యాజువల్‌ సెలవులు(సీఎల్‌) ఇవ్వాలి. మహిళా ఉద్యోగికి 180 రోజుల వరకు పిల్లల దత్తత సెలవు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉండి ఏడాది వయస్సున్న బిడ్డను చట్టబద్ధంగా దత్తత తీసుకుంటే ఇది వర్తిస్తుంది. పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలల్లోపు 15రోజుల పితృత్వ సెలవు ఉంటుంది. పిల్లల సంరక్షణ సెలవులను 180రోజులకు పెంచాలి. గరిష్ఠంగా మూడు విడతలుగా తీసుకోవచ్చు. దివ్యాంగులకు ఏడాదికి ఏడు ప్రత్యేక సెలవులు. అధిక ప్రమాదకరమైన వార్డుల్లో పనిచేసే నర్సింగ్‌ సిబ్బందికీ ఇది వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల బిల్లులు చెల్లించాలి ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్యోగ ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌)లో కాలక్రమేణా ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌తోపాటు ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను పెంచాలి. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అదనపు నిధులు విడుదల చేసి నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పెండింగ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించాలి. వార్షిక ఆరోగ్య పరీక్షల సదుపాయాన్ని పెన్షనర్‌, అతని జీవిత భాగస్వామికి కల్పించాలి. ఈహెచ్‌ఎస్‌ సదుపాయం కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోని కొన్ని ఆస్పత్రులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు మాట్లాడాలి. పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు వైద్యభత్యాన్ని నెలకు రూ.500 పెంచాలి. ♦స్థిర రవాణా భత్యం నెలకు రూ.1,700 మైలేజి అలవెన్సుని కిలోమీటరుకు పెట్రోల్‌ వాహనాలకు రూ.15.50, డీజిల్‌ వాహనాలకు రూ.11.50, మోటర్‌సైకిళ్లకు రూ.6.40 చెల్లించాలి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తే రోజువారీ భత్యం, లాడ్జింగ్‌ ఛార్జీలను 33% పెంచాలి. రోజుకు రూ.300 నుంచి రూ.600 చెల్లించాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తే రూ.400 నుంచి రూ.800. కోర్టు మాస్టర్లు, న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శులకు రవాణా ఛార్జీలు నెలకు గరిష్ఠంగా రూ.5వేలు. స్థిర రవాణా భత్యం గరిష్ఠంగా నెలకు రూ.1,700. ప్రస్తుతం ఇది రూ.1,200గా ఉంది. పశుసంవర్థకశాఖ, సహకార, పట్టుపరిశ్రమ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగాలను ఇందులో చేర్చాలి. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పరిమితిని సంవత్సరానికి రూ.2,500కు పెంచాలి. గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది. మరణించిన ఉద్యోగి అంత్యక్రియల ఖర్చుకు రూ.20వేలు ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రత్యేక కాంపెన్సేటరీ భత్యం నెలకు కనీసం రూ.700, గరిష్ఠం రూ.1800కు పెంపు. పశుసంవర్థక శాఖ, అటవీశాఖలో అర్హులైన ఉద్యోగులను రిస్క్‌ అలవెన్స్‌ జాబితాలో చేర్చాలి. అంధ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు రీడర్స్‌ అలవెన్సు గరిష్ఠంగా 33% పెంచాలని సిఫార్సు. నెలకు రూ.1,200 చొప్పున ఇవ్వాలి. దిల్లీ ఏపీభవన్‌ సిబ్బందికి దిల్లీ భత్యం కింద ప్రాథమిక చెల్లింపులో 15% గరిష్ఠంగా నెలకు రూ.5వేలు. డ్రైవర్లకు ప్రత్యేక గ్రాట్యుటీ అలవెన్సు సిఫార్సు. నెలలో 100గంటల పరిమితికి లోబడి గంటకు రూ.30 ఇవ్వాలి. దివ్యాంగులకు కన్వేయన్స్‌ అలవెన్సు కింద గరిష్ఠంగా నెలకు రూ.2వేలు ఇవ్వాలని సిఫార్సు.


5 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page