top of page

ఉద్యోగులున్యూస్ఇంటర్వ్యూలో  ఏపీజీఈఎఫ్ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి దసరాకు రెండు డీఏలు, పెండింగు జీతాలు

Updated: Aug 23, 2021



దసరాకు రెండు డీఏలు, పెండింగు జీతాలు... *        ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా  ఉంది *        గత ప్రభుత్వంలో ఒక్కనాయకుడైనా  పోరాడారా? *        20శాతం ఐఆర్ ఇస్తే ఈ ఉద్యోగ నాయకులు సంబరాలు చేయలేదా? *        27శాతం ఐఆర్ ఇప్పించింది మా ఫెడరేషనే కదా? *        వినతి పత్రాలు ఇచ్చి వాట్సాప్ ప్రచారం చేసుకునే వాళ్లు ఎక్కువయ్యారు *        ఉద్యోగులు న్యూస్ ఇంటర్వ్యూలో  ఏపీజీ ఈఎఫ్ ఛైర్మన్  కె.వెంకట్రామిరెడ్డి (ఉద్యోగులు న్యూస్)

దసరా నాటికి ఉద్యోగులకు రెండు డీఏలు, పెండింగు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం  నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని అన్నారు.  సెప్టెంబరు 30న ఇలాంటి అంశాలపై సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు సమావేశమయ్యారని, ఆ సారాంశం ముఖ్యమంత్రికి నివేదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ‘ఉద్యోగులు న్యూస్’కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. గత ప్రభుత్వం 20శాతం ఐఆర్ ప్రకటిస్తే  సంబరాలు చేసిన నాయకులు ఎవరని, 27శాతం ఐఆర్ సాధించింది తాము కాదా అని ఆయన ప్రశ్నించారు. కొందరు నేతలు వినతిపత్రాలు ఇచ్చి వాట్సాప్ ల్లో పెట్టి ప్రచారం  చేసుకుంటారని, మేం ప్రయత్నాలు చేసి ఆనక నిర్ణయాలు వస్తే తమ వల్లే అది సాధ్యమయిందని వారు ప్రచారం చేసుకునే తంతు సాగుతోందన్నారు. కిందటి ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగ సంఘం నాయకుడైనా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగారా అని  ప్రశ్నించారు. తాను పోరాడబట్టే 15 నెలలు ప్రభుత్వం అనసరంగా సస్పెండ్ చేసిందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.  ముఖాముఖి  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...


ఉద్యోగులు న్యూస్  కొత్త ప్రభుత్వం  వచ్చిన తర్వాత  ఉద్యోగుల పరంగా మీరు సాధించింది ఏమిటి? వారి సమస్యలు ఏవేవి పరిష్కరించారు?

వెంకట్రామిరెడ్డి

ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ రావడంలో మా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పాత్ర ఉంది. గత ప్రభుత్వం 20 శాతం ఐఆర్ ప్రకటించినప్పుడు ఈ నాయకులంతా సంబరాలు చేసుకొని ఆనాటి సీఎం గారికి సన్మానాలు చేశారు.  అప్పుడే ఆ సన్మానాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది కేవలం మేము మాత్రమే. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి సార్  ని కలిసి 27 శాతం ఐఆర్ ను మేనిఫెస్టోలో చేర్చాలని కోరగా ఆయన తక్షణం అంగీకరించారు.  అధికారం చేపట్టిన వెంటనే మొదటి కేబినెట్ లోనే 27 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు,  3,790 ఐదు మంది వీఆర్ఏలకు  వీఆర్వోలు గా ప్రమోషన్ కల్పించి రెగ్యులరైజ్ చేయడం, కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెల జీతం  ఇప్పించడం, డిపార్ట్మెంట్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు తొలగించడం, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు వంటి వాటి విషయంలో మా  గవర్నమెంట్ ఫెడరేషన్ కృషి ఎంతో  ఉంది.

ఉద్యోగులు న్యూస్

 సీపీఎస్ ఉద్యోగులను సీఎం జగన్ వద్దకు  తీసుకువెళ్లారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం ఉంటుందని చెప్పి నెల్లాళ్లయింది. మరి పురోగతి ఏమీ లేదు?

వెంకట్రామిరెడ్డి

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి అతి త్వరలో నే  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై  పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తాం ఉద్యోగులు న్యూస్

 కరోనా  ఆరు నెలలుగా విజృంభిస్తోంది. ఇప్పటికీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు కాలేదు?

వెంకట్రామిరెడ్డి

కరోనా వ్యాప్తి ప్రారంభమైన మొదట్లో ఉద్యోగులకు సెలవులు అవసరం పెద్దగా రాలేదు కాబట్టి ఎవరు వాటి గురించి ఆలోచించలేదు. లాక్ డౌన్ సడలింపు మొదలయ్యాక ఉద్యోగులు కరోనా  బారిన పడటం  మొదలైంది. ఇది గమనించిన మేము ఉద్యోగులకు 28 రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని జులైలో ప్రభుత్వాన్ని కోరాం. దానిమీద ఆర్థిక శాఖ ప్రతిపాదనలు రూపొందించి వైద్యఆరోగ్యశాఖ అభిప్రాయం తీసుకొని ఫైలును సీఎంకు  సర్క్యులేట్ చేశారు.  ఈ మధ్యకాలంలో కొందరు నాయకులు 14 రోజులు సెలవులు సరిపోతాయని ప్రభుత్వానికి లేఖలు ఇచ్చారు. ప్రస్తుతం వైరస్ తీవ్రత కొద్దిగా తగ్గింది కాబట్టి 28 రోజులు కాకపోయినా కనీసం 21 రోజులు సెలవు మంజూరు చేయాలని మేము కోరుతున్నాం. 21 రోజులు సెలవులతో ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నాం.


ఉద్యోగులు న్యూస్  కరోనా సోకిన ఉద్యోగులకు వైద్యమూ  కష్టమవుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కార్డు ఉపయోగపడటం లేదు. మరో వైపు రీ యింబర్స్ మెంటు నిలిపివేశారు. ఉద్యోగులు  ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు.  ఏమిటి పరిష్కారం?

వెంకట్రామిరెడ్డి

 ఉద్యోగుల ఆరోగ్య కార్డును ప్రభుత్వం  పటిష్ఠంగా అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్ వర్కు లో ఉండే ప్రతి హాస్పిటల్ ఉద్యోగుల ఆరోగ్య కార్డు అనుమతించాలని, లేకపోతే గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వం ఆగస్టులో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కరోనా బాధితులకు కూడా ఈ కార్డు కింద వైద్యం చేస్తున్నారు. ఏ హాస్పిటల్ అయినా హెల్త్ కార్డులు అనుమతించకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులను కోరుతున్నాం. అలాగే  రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో నుంచి నివేదిక రావాల్సి ఉంది. నివేదిక త్వరగా రప్పించుకొని ని రీయింబర్స్మెంట్ కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం.

ఉద్యోగులు న్యూస్ పీఆర్ సీ, డీఏలు, పెండింగు జీతాలు ఉద్యోగులకు ఎప్పుడు రాబోతున్నాయి. మీరు ఇందుకోసం ఏం చేస్తున్నారు? వెంకట్రామిరెడ్డి  ఆగస్టు 31న  జగన్ సర్ ను కలిసి ఈ విషయంలో  లేఖ అందించాం.  వీటిని పరిష్కరించ వలసిందిగా కోరాం.  పెండింగు డీఏల అమలు, పెండింగు జీతాలు ఇవ్వడం, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలు పరిష్కరించాలని మేం కోరాం. సెప్టెంబరు 23న ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 22న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఆ సమావేశం సెప్టెంబర్ 30న జరిగింది. ఈ సమావేశ వివరాలను ముఖ్యమంత్రి కి తెలియజేసి తుది నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. దసరాకు కనీసం రెండు డీ ఏ లు పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం  తీసుకుంటుందని అనుకుంటున్నాం.

ఉద్యోగులు న్యూస్

 ఈ మధ్య ఒక  ఉద్యోగ సంఘం నేతపై విమర్శలు చేశారు. ఆయన  ఉద్యోగుల అంశాలు అనేకం బహిరంగంగా లేవనెత్తారు. అధికారులపై ధ్వజం ఎత్తారు. మీరు ఆయనపై విమర్శలు చేశారు.  ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులు  ఉద్యోగుల సమస్యలు సవ్యంగానే పరిష్కరిస్తున్నారా?

వెంకట్రామిరెడ్డి

 ఆ నాయకుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చేసిన విమర్శలు అభ్యంతరకరం.  ఆమె వద్ద  ఏ ఫైలూ ఆలస్యం కాదు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అంశాలు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఫైళ్లు వేగంగా క్లియర్ చేసే అధికారిని విమర్శిస్తే బాధనిపించింది. ఉద్యోగులు న్యూస్

 మీకు ప్రభుత్వ అనుకూల  ఉద్యోగ నేతగా ముద్ర పడింది.  మీరు ఉద్యోగుల పక్షమా? ప్రభుత్వ పక్షమా?

వెంకట్రామిరెడ్డి

 నేనెప్పుడూ ఉద్యోగుల పక్షమే. నాకు ముఖ్యమంత్రి జగన్ సార్ ను తరచు కలిసే వెసులుబాటు ఉంది కాబట్టి సమస్యలను నేరుగా ఆయనకే చెబుతుంటాను. ఆ విషయాలు మీడియాకు చెప్పను.. కానీ అధికారుల వద్ద  నిరంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తూనే ఉంటాను. ఇప్పుడు చాలామంది నాయకులు ఉద్యోగుల సమస్యలపై ఒక లేఖ తయారు చేసి దానిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి ప్రచారం చేసుకోవడం, ఆనక పని జరిగితే తమ వల్లే జరిగిందంటూ మళ్ళీ ప్రచారం చేసుకోవడం, ఇదే తంతుగా మారింది.

ఉద్యోగులు న్యూస్

ఎప్పుడైనా ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎవరి పక్షాన నిలబడతారు?

వెంకట్రామిరెడ్డి

 కచ్చితంగా ఉద్యోగుల పక్షానే నిలబడతాను. గతంలో ప్రభుత్వం 50 సంవత్సరాలకే ఉద్యోగులను బలవంతపు పదవీ విరమణ చేయించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో 5 జీ వో లు తయారుచేసింది. ఆ జీవోలు విడుదల అయి ఉంటే ఉద్యోగులు పరిస్థితి పై అధికారుల కింద బానిస బతుకు అయ్యేది. ఈ విషయం ఆనాటి ఉద్యోగ సంఘ నాయకులు అందరికీ తెలుసు. వారెవరూ నోరు విప్పక పోగా అలాంటి ప్రతిపాదన లేదని బుకాయించారు. ఆరోజు కేవలం నేను ఒక్కడిని మాత్రమే వాటికి వ్యతిరేకంగా పోరాడాను. మా సచివాలయ ఉద్యోగులు సహకారంతో వాటిని అడ్డుకున్నా ను. అందుకు నాపై కక్ష కట్టిన ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండా నన్ను 15 నెలలు సస్పెండ్ చేసింది. అయినా ఎప్పుడూ ఉద్యోగుల సమస్యలపై వెనుకాడలేదు.

ఉద్యోగులు న్యూస్

 మీరు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా అనవసరంగా  ఇతర సంఘాల అంశాలను లేవనెత్తుకుంటున్నారని కొందరు అంతర్గతంగా విమర్శిస్తున్నారు. మీరు ఏమంటారు?

వెంకట్రామిరెడ్డి

 మా ఫెడరేషన్ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఈ రకమైన విమర్శలు చేస్తూ ఉండొచ్చు.  నేను సచివాలయ సంఘం అధ్యక్షుడిని కాకముందే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ను. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఉద్యోగ సంఘం నాయకుడు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించిన పాపాన పోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు గొంతు  వినిపించడానికి ఈ ఫెడరేషన్  ఏర్పాటు చేశాం. ఈ ఫెడరేషన్ దాదాపు అరవై పైగా సంఘాల కలయికతో ఏర్పడింది . నేను ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఏనాడు సచివాలయ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయలేదు. ఈ విషయం మా సచివాలయ ఉద్యోగులకు తెలుసు .వారు నన్ను అర్థం చేసుకుంటారు. మొదటి సారి ఒక సచివాలయ ఉద్యోగికి రాష్ట్ర స్థాయి ఉద్యోగులందరికీ నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు మా సచివాలయ ఉద్యోగులు కూడా గర్వ పడతారని భావిస్తున్నా.

ఉద్యోగులు న్యూస్

 సివిల్ సర్వీసు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు డిమాండ్ వచ్చింది కదా; మీరు ఏమంటారు?

వెంకట్రామిరెడ్డి

 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేం కూడా చాలా కాలం నుంచి కోరుతున్నాం. అంత కంటే ముందు దానిని పునర్నిర్మించాలని అవసరం ఉంది. అందులో తెలంగాణకు సంబంధించిన సంఘాలకు ఇంకా సభ్యత్వం ఉంది. అలాగే అర్హత లేని కొన్ని సంఘాలకు సభ్యత్వం ఇచ్చారు. వాటిని తొలగించాలి.  అర్హత గల కొన్ని సంఘాలకు సభ్యత్వం కల్పించాల్సి ఉంది

36 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page