top of page

బాలల దినోత్సవం(చిల్డ్రన్స్ డే నవంబర్ 14)

నవంబర్ 14 భారత దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ

జయంతి ,పిల్లల దినోత్సవం(చిల్డ్రన్స్ డే)

ఘనంగా నిర్వహించు కుందాం.

నేటి బాలలు రేపటి పౌరులు.

ఈ సమాజం లో అశాస్త్రీయ భావనలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథం (Scientific temper) ను ముందుకు తీసుకుని వచ్చిన శాస్త్రీయ భావాల ఘని ,ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల ఆధ్యుడు,

దేశ అభివృద్ధి కోసం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం ఐఐటీలు, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను స్థాపించిన మహనీయుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని దేశ ప్రజానీకం, అందులోనూ పిల్లలకి ఇష్టపాత్రుడైన, పిల్లల్ని ప్రేమించే మామ నెహ్రూ , జరుపుకోవడం, మహనీయుని ఆదర్శాలను త్యాగాలను దార్శనికతను కొనియాడడం, ప్రస్తుత తరుణంలో ప్రతి భారతీయుని తక్షణ కర్తవ్యం.

భారతదేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన నిలపడం కోసం కృషి చేసిన మహనీయుడు.

ఆధునిక భావాల తాత్విక దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది.

స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం శాస్త్రీయ దృక్పథం లౌకికవాదం వంటి ఆధునిక భావాలను భారతదేశవ్యాప్తంగా వెదజల్లి వాటిని పరిపుష్టం చేయడానికి అహరహం శ్రమించిన ఆధునిక తాత్వికుడు పండిత నెహ్రూ.


నెహ్రూ నవంబర్ 14, 1889న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని (గతంలో యునైటెడ్ ప్రావిన్సెస్) గంగా నదిపై వెలసిన అలహాబాద్‌లో జన్మించాడు.తన 74 ఏళ్ల వయస్సులో 27 మే 1964 వ సంవత్సరంలో గుండెపోటు వల్ల మరణించారు. అతని తండ్రి, మోతీలాల్ నెహ్రూ,తల్లి స్వరూప్ రాణి. మోతీలాల్ ప్రసిద్ధ న్యాయవాది.నెహ్రూ చిన్నతనం నుండి పాశ్చాత్య పద్ధతిలో పెరిగాడు.

జవహర్‌లాల్ నెహ్రూ ప్రాథమిక మొదలు న్యాయశాస్త్రం వరకు ఇంగ్లండ్‌లో

చదివాడు. భారతదేశానికి తిరిగి వచ్చాక భారత జాతీయోద్యమం లో పాల్గొన్నారు.

నెహ్రూను తన రాజకీయ వారసుడిగా ప్రకటించేంతగా గాంధీ మనసు చూరగొన్నారు. నెహ్రూ ప్రపంచ సాహిత్యాన్ని బహుముఖంగా అధ్యయనం చేశాడు.అదే అతనిలో ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథాన్ని పెంపొందించింది. ఆయన మంచి చదువరే గాక మంచి సాహిత్యకారుడు కూడా. ఆయన ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ , ఆత్మకథ, టువర్డ్ ఫ్రీడమ్ వంటి అనేక పుస్తకాలను రచించాడు.

క్విట్ ఇండియా ఉద్యమ (1942) సమయం లో జవహర్‌లాల్ నెహ్రూ జైలు శిక్ష అనుభవిస్తున్న ప్పుడు 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో భారతీయ చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం మొదలైన అంశాలున్నాయి.

ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత వంటి వాటికి ఆయన ప్రాముఖ్యత ఇవ్వలేదు. మానవతావాదమే అతనికి దేవుడు. సమాజ సేవే అతని మతం. నెహ్రూకు మనిషిపై ఎనలేని విశ్వాసం ఉండేది. స్వభావ రీత్యా ఆయనది శాస్త్రీయ మానవతా వాదం.

జవహర్‌లాల్ నెహ్రూ తాత్వికత ప్రజాస్వామ్యం,లౌకికవాదం,సోషలిజం,మానవతావాదం,

సామ్యవాదం మొదలైన వాటి నుండి వచ్చిన ఆధునిక భావాల సమాహారం.

ఆధునికత అంటే సమాజాన్ని కుల మత లింగ ప్రాంతాలకు అతీతంగా చూడటం. శాస్త్రీయంగా ఉండటం. నెహ్రూ ఇలాంటి ఆధునిక భావాలు అలవర్చుకున్నవాడు కనుకనే ఆయన కుల వివక్షను, వర్ణ వ్యవస్థ ను వ్యతిరేకించారు. అతని ప్రాపంచిక దృక్పథం మానవవాదం. దాంతో ఆయన ప్రజా స్వామ్యాన్ని బలపరిచారు. అందువల్లనే ఫాసిజాన్ని వ్యతిరేకించారు. ఫాసిస్టులు స్పెయిన్ పై దాడి చేస్తున్నప్పుడు స్పెయిన్ కు సంఘీభావం ప్రకటించడానికి అక్కడికి వెళ్లాడు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ప్రజలు బాధ్యతగా ఉంటూ,అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర వ్యక్తుల ఆలోచనలను, ప్రత్యేకంగా మనల్ని వ్యతిరేకించే వారి ఆలోచనలను సహించడం నేర్చుకోవాలన్నారు. సమాజంలోని అతిపెద్ద బలహీనత భయం అన్నారు జవహర్‌.

నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని ఉత్తమ ప్రభుత్వంగా విశ్వసించాడు. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అతను అవిశ్రాంతంగా పనిచేశాడు. వ్యక్తి స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధికి ప్రజాస్వామ్యం అవసరమని ఆయన విశ్వసించారు .

భారతదేశ ఐక్యత,సమగ్రత కోసం లౌకికవాదం చాలా అవసరమని నెహ్రూ బలంగా నమ్మారు. అన్ని మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టించాలని, వివక్షకు భయపడకుండా ప్రజలు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించే సమాజాన్ని సృష్టించాలన్నారు.

‘‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురికారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మనం మత తత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు.’’ ఇదే భారత్‌ భవిష్యత్తు అంటూ నెహ్రూ ప్రకటించారు.

షెడ్యుల్డ్ కులాలు , తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక అసమానతలను, పీడనను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు , విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.సమాజం ఆర్థికాభివృద్ధి సాధించే కొద్దీ ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందన్నారు.

ఇది భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి దోహదపడుతుందన్నారు. అయితే ఇది జాతీయ వాదులకు, మను వాదులకు ఇది రుచించదు.

ఒకే సంస్కృతి,ఒకే ప్రజ,ఒకే భాష, ఒకే జాతి ఉండాలని కోరుతుంది జాతీయవాదం.

వర్ణ వ్యవస్థ ను అలాగే కాపాడాలంటుంది మనువాదం. భిన్నత్వాన్ని ధ్వంసం చేసి ఏకత్వం తీసుకు రావాలని భావించే జాతీయ వాదం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది. అందువల్ల జాతీయ వాద భావాలు గలవారు నెహ్రూ తాత్వికతను వ్యతిరేకిస్తుంటారు.

నెహ్రూ భూసంస్కరణలు అమలు చేయడానికి గాను మొదటిదిగా జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు. వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందించారు. స్థానిక స్వపరిపాలన ద్వారా వీటి అమలుకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమలను ఆధునిక దేవాలయాలన్నారు.

నెహ్రూ మొదట అమెరికా పెట్టుబడిదారీ విధానానికి ఆసక్తి చూపినప్పుడు అమెరికా నుండి ఎలాంటి సహాయం అందకపోగా రష్యా మాత్రం అడక్కుండానే చేయూతనిచ్చింది. రష్యా అభివృద్ధిని చూసిన తర్వాత నెహ్రూ క్రమబద్ధ ప్రణాళికతో దేశాభివృద్ధి సాధించవచ్చని గుర్తించారు. ఆ తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో ప్రభావితమయ్యారు.

నెహ్రూ ఫేబియన్ సోషలిజాన్ని ప్రతిపాదించి దాన్ని అమలు చేశాడు. విప్లవం ద్వారాకాకుండా క్రమబద్ధమైన సంస్కరణల ద్వారా ప్రజాస్వామ్య సూత్రాలను ముందుకు తీసుకెళ్లడాన్ని ఫేబియన్ సోషలిజం అంటారు. ఆయన ప్రకారం సోషలిజం ఆర్థిక సిద్ధాంతం కాదు,అదొక జీవన తత్వం. నిరుద్యోగం, దోపిడీ, ప్రజల బానిస మనస్తత్వం సోషలిజం ద్వారానే అంతం కాగలవన్నాడు. సోషలిజం వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉండరాదన్నాడు. నెహ్రూ ప్రకారం, వ్యక్తిగత ఆస్తి కూడా సోషలిజంలో ఉంటుంది. అయితే అది ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండరాదన్నాడు. సోషలిజం ఆర్థిక సామాజిక అసమానతలను తొలగిస్తుందన్నాడు. అంబేద్కరు కూడా సోషలిజాన్ని సమర్థించారు. ఆయన ప్రధాన రంగాలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలని అంబేద్కర్ భావిస్తే, నెహ్రూ మిశ్రమ ఆర్థిక విధానాల వైపు మొగ్గు చూపాడు. భారతదేశ లక్ష్యం సోషలిజం అన్నారు. తరువాత సోషలిజం పదాన్ని రాజ్యాంగ పీఠిక లోకి తీసుకున్నారు.

గాంధీ జీవనమార్గమైన అహింసా మార్గాన్ని సమర్థించారు.హింసా మార్గం స్వేచ్ఛ ను హరిస్తుందన్నాడు.సమాజంలోని అతిపెద్ద బలహీనత భయం అన్నారు జవహర్‌లాల్ నెహ్రూ.

ప్రాచీన భారతీయ చరిత్ర, వేదాంతశాస్త్రం, తత్వశాస్త్రం, భారతీయ సంస్కృతిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు.గాంధీ అహింస హిందూ మతం యొక్క ప్రధాన సూత్రమని నమ్మాడు. అయితే నెహ్రూ భారతీయ తాత్వికత లౌకిక విధానంగా భావించాడు.

నెహ్రూ మానవతావాది. ప్రతి ఒక్కరినీ గౌరవంగా, కరుణతో చూసే సమాజాన్ని రూపొందించాలన్నారు.

భాషలు, సంస్కృతులు, మతాల మధ్య వైవిధ్యం ఉన్నప్పటికీ , భారతదేశం ఏకీకృత దేశంగా ఉండాలనే ఆలోచనకు నెహ్రూ కట్టుబడి ఉన్నారు . భారతదేశ బలం దాని వైవిధ్యంలో ఉందని అతను బలంగా నమ్మాడు. అతను జాతీయ ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడానికి పనిచేశాడు.

నెహ్రూ విద్య, విజ్ఞాన శాస్త్రానికి పెద్దపీట వేసిన వాడు. వ్యక్తిగత, జాతీయ అభివృద్ధికి విద్య చాలా అవసరమని అతను విశ్వసించాడు. భారతీయులందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశాడు. భారతదేశ ఆర్థికాభివృద్ధికి , సామాజిక పురోగతికి సైన్స్ , టెక్నాలజీ చాలా అవసరమని కూడా ఆయన విశ్వసించారు.

నేటి బాలలే రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు. వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. దేశంలోని మారుమూల గ్రామీణ బాలలకు విద్య అందించడానికి సార్వత్రిక ప్రాథమిక విద్యా పధకాన్ని ప్రవేశపెట్టాడు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తమిళనాడులో కె.కామరాజ్‌ ద్వారా మొదటిసారిగా అమలు చేశాడు.ఉన్నత విద్యాలయాలను స్థాపించి శాస్త్రసాంకేతికతను సంబంధిత రంగాలను ప్రోత్సహించారు.


నెహ్రూ మార్క్సిస్టు తాత్వికతను అర్థం చేసుకున్నాడు కానీ ఆమోదించలేదు. "మార్క్సిస్ట్ తాత్విక దృక్పథంలోని పదార్థం నుండే ఈ ప్రపంచం వచ్చిందని, పరిణామం ద్వారా నిరంతర మార్పు జరుగుతుందని ,చర్య ప్రతిచర్య, కార్యకారణ సంబంధం, థీసిస్, యాంటీ థీసిస్ మొదలై నవన్నీ నేను ఇబ్బంది లేకుండా అంగీకరించగలను”అని తన “ది డిస్కవరీ ఆఫ్ ఇండియా”లో రాసుకున్నారు.

భారత పాకిస్తాన్ ల వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహించడానికి ఐక్యరాజ్య సమితి గానీ మరేదేశం గానీ అవసరం లేదన్నారు. రెండు దేశాలూ తమ సొంత సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నాయన్నారు. "గ్రామాలు సాధారణంగా మేధోపరంగా మరియు సాంస్కృతికంగా వెనుకబడి ఉంటాయి. వెనుకబడిన వాతావరణం నుండి ఎటువంటి పురోగతి సాధించదు."అని అభిప్రాయపడ్డారు.

దూరదృష్టిగల రాజనీతిజ్ఞుడు గా ప్రపంచం జవహర్లాల్ ను గుర్తించింది. ప్రపంచానికి నెహ్రూ ఇచ్చిన గొప్ప బహుమతి అలీన విధానం. నాన్-అలైన్‌మెంట్ అనేది కొత్తది కాదు . కాకపోతే దీన్ని ఉద్యమంగా మార్చినవాడు నెహ్రూ.ఇది మూడవ ప్రపంచ దేశాల తరపున గొంతెత్తి మాట్లాడే బలీయమైన శక్తిగా భారతదేశం ఉండటానికి దోహదం చేసింది. భారతదేశం ఏదైనా ప్రత్యేక కూటమి లేదా సూపర్ పవర్‌తో పొత్తు పెట్టుకోకూడదని, బదులుగా దాని స్వంత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని ఆయన విశ్వసించారు.అయితే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు అలీన విధానాన్ని పక్కన పెడతామని కూడా నెహ్రూ అన్నారు.

నెహ్రూ శాంతి అహింసా విధానాలతో పాటు బుద్దుడు సమాజానికి బోధించిన పంచశీల లాగా దేశాల మధ్య ఆచరణీయమైన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు. పంచశీల ప్రధాన లక్షణాలు

(i) ఒకరికొకరు ప్రాదేశిక సమగ్రత ను గౌరవించుకోవాలి (ii) ఒకరిపైనొకరు దాడులు చేసుకోరాదు. (iii) ఒకరి అంతర్గత విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరాదు. (iv) సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం కలిగి ఉండాలి (v) శాంతియుత సహజీవనం. కానీ ఇరుగు పొరుగు దేశాలకు చాలా సార్లు పంచశీల గుర్తు చేయవలసి వస్తోందంటే నెహ్రూ అందించిన పంచశీలకున్న ప్రాధాన్యత ను అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది.


భారతదేశ భవిష్యత్తు పురుషుల కంటే మహిళలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందన్నారు. మహిళలు ప్రజా జీవితంలో తమ వంతు పాత్రను పోషించే అవకాశం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.అందువల్ల స్త్రీలను ప్రజా జీవితంలో, రాజకీయాల్లో పాల్గొనడాన్ని వ్యతిరేకించే పితృస్వామ్యాన్ని ఆయన వ్యతిరేకించారు. పార్లమెంటులో మహిళల సంఖ్యను పెంచాలని పదేపదే చెప్పాడు. మహిళలకు పూర్తిగా అవకాశాలను ఇవ్వక పోతే అది అవివేకమవుతుందన్నాడు నెహ్రూ. పార్లమెంటు లో మహిళలకు 33%రిజర్వేషన్ 2029 కి గానీ అమలు జరిగే పరిస్థితి కనబడటం లేదు.


అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు ఆయనకు అతి పెద్ద పరీక్ష పెట్టింది. నెహ్రూ దానిని ఆమోదించినా ఛాందసవాదుల వల్ల ఆ బిల్లు వీగిపోయింది. అంబేద్కర్ రాజీనామా చేశారు. అయితే 1951 తరువాత చివరకు చట్టంగా ఆమోదించబడింది.అది నాలుగు వేర్వేరు చట్టాలు గా ఆమోదించబడింది. 1955 హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, మైనారిటీ , సంరక్షక చట్టం మరియు దత్తత, మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఈ చట్టాలు పురుషులకు, మహిళలకు ఏకభార్యత్వాన్ని, విడాకుల హక్కును ప్రవేశపెట్టాయి. వివాహ వయస్సును పెంచాయి. మహిళలకు కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించాయి. ఉమ్మడి సివిల్ కోడ్‌ ఏర్పరచాలని నెహ్రూ, డా. BR అంబేద్కర్ ఇద్దరూ భావించారు.

నెహ్రూ తాత్వికత భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అది నేటికీ భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, మానవతావాదం, భిన్నత్వంలో ఏకత్వం, విద్య , విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి అతని ఆలోచనలు నేటికీ ప్రాసంగికత కలిగి ఉన్నాయి . అవి భారతదేశ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తున్నాయి. ఆయన ఆలోచనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.


కానీ దురదృష్టవశాత్తు నేటి పాలకులు నెహ్రూ నెహ్రూ దూర దృష్టిని, దృక్పథాన్ని సమాజంలో లేకుండా చేయడానికి అసత్య ,నిందారోప ఆరోపణలతో, వక్రభాష్యాలతో , చరిత్రను వక్రీకరిస్తున్నారు.


ఈ నేపథ్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని మన విద్యాలయాల్లో ఘనంగా నిర్వహించుకోవడం శాస్త్ర ప్రచార ఉద్యమం (సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్ ) లో ముఖ్యమైన భాగంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం.


ఈ సందర్భంగా బాలబాలికలకు వారిలో శాస్త్రీయ, తార్కిక , సృజనాత్మక ఆలోచన పెంచే విధంగా వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్, పెయింటింగ్, క్లే మోడలింగ్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ,ప్ల కార్డ్స్ తయారీ లాంటి పోటీలు నిర్వహించి బాలల దినోత్సవం ఘనంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను.

12 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page