ఇంకా విడుదలకాని ఇంటర్ ప్రవేశాల మార్గదర్శకాలు.రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపుపై సందిగ్ధం.ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో సీట్ల భర్తీని ఆన్‌లైన్‌లో చేస్తామని ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. మరోపక్క కరోనా కారణంగా పదో తరగతిలో అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించడంతో ప్రైవేటు కళాశాలలు చాలా వరకు అనధికారిక ప్రవేశాలు పూర్తి చేశాయి. కొన్ని కళాశాలలు ఇప్పటికే దాదాపు నెలన్నరగా జేఈఈ, నీట్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఆగస్టు 16 నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈలోపు ప్రవేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు ఆన్‌లైన్ ప్రవేశాల విధానం ప్రకటించకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు.సందేహాలు ఎన్నో..!పదో తరగతిలో ఒకేలా మార్కులు వచ్చిన పలువురు విద్యార్థులు ఒకే కళాశాలకు ఐచ్ఛికాన్ని ఇస్తే ఏ విధానంలో కేటాయిస్తారు?ఈ ఏడాది ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా 10శాతం అమలుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రిజర్వేషన్ అమలుకు సీట్లను పెంచుతారా? ఉన్న వాటిలోనే అమలు చేస్తారా?రిజర్వేషన్లు కళాశాల యూనిట్‌గా ఉంటాయా? మొత్తం సీట్లపై అమలు చేస్తారా? వృత్తి విద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు 10శాతం అదనంగా సూపర్ న్యూమరీ సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటిసారి నిర్వహిస్తున్న ప్రవేశాలకు ఎలా అమలు చేస్తారు?ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థులు, తల్లిదండ్రులను పీడిస్తున్నాయి. వీటిపై స్పష్టత రావాలి అంటే ముందుగా మార్గదర్శకాలు విడుదల చేయాలి. ఎంత త్వరగా విడుదల చేస్తే విద్యార్థులకు వాటిపై అంత అవగాహన ఏర్పడే అవకాశం ఉంది.ఖరారుకాని ఫీజులు.ఇంటర్ ఫీజులను ఇంతవరకు ప్రకటించలేదు. ఫీజులను బట్టే విద్యార్థులు కళాశాలను ఎంచుకుంటారు. ఎంసెట్, జేఈఈ, నీట్ కోచింగ్‌లు, వసతి గృహాలు, తరగతి గది బోధనకు ఫీజులను వెల్లడిస్తే తల్లిదండ్రులకు స్పష్టత వస్తుంది. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ గతేడాది ఫీజులను నిర్ణయించలేదు. ట్యూషన్ ఫీజులో 30శాతం రాయితీ ఇవ్వాలని ప్రకటించింది. దీన్ని కొన్ని యాజమాన్యాలే అమలు చేశాయి.అవగాహన ఎప్పుడు.కరోనా కారణంగా విద్యార్థులు ఇళ్ల వద్ద ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి ఆన్‌లైన్ ప్రవేశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. దీనిపై ఇంటర్ విద్యామండలి దృష్టిపెట్టడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చేరాలంటే ఆన్‌లైన్‌లోనే ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆన్‌లైన్‌పై అవగాహన లేకపోతే ప్రవేశాలు పొందడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. గతేడాది ఆన్‌లైన్ ప్రవేశాలకు ఐచ్ఛికాలు తీసుకున్నా న్యాయస్థానం ఆదేశాలతో నిలిపివేశారు.