Earned Leave నీ ప్రతీ ఏడాది సరెండర్ చేసుకుని నగదు తీసుకోవడం మంచిదా లేక నిల్వ ఉంచుకోవడం మంచిదా?
మంచిదా చెడ్డదా అనేది మన అవసరాలను బట్టి ఆధార పడి ఉంటుంది. ఎవరికైనా వ్యక్తిగత పరిస్థితుల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ సెలవుల అవశ్యకత ఎక్కువగా ఉంటే సరెండర్ చేసుకోకుండా నిల్వ ఉంచుకోవడం మంచిది. సహజంగా అలాంటి పరిస్థితులు చాలా తక్కువ మందికి ఉంటాయి.
వెకేషన్ డిపార్టుమెంటు లలో పని చేసే వారుగాని నాన్ వెకేషన్ డిపార్టుమెంటు లలో పనిచేసేవారు గానీ వారి సర్వీసును బట్టి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది
సాధారణ ఉద్యోగులకు అయితే ప్రతీ ఏడాది సరెండర్ చేసుకుని నగదు పొందటమే మంచిది. ఎందుకంటే ఈ దిగువ ఉదాహరణను చూడండి.
ఒక ఉద్యోగికి (నాన్ వెకేషన్ డిపార్టుమెంటు) ప్రతీ ఏడాది 30 earned leaves క్రెడిట్ అవుతాయి. ఒక ఉద్యోగికి ఉండే గరిష్ట నిల్వ 300 మాత్రమే. ఒకసారి మన సెలవుల నిల్వ 300 చేరితే ఇక తరువాత జమ కావు. Lapse అయిపోతూ ఉంటాయి.
ఒక ఉద్యోగికి మొత్తం సర్వీస్ 30 ఏళ్లు ఉందని అనుకుందాం. అలాంటి సందర్భంలో అతనికి ప్రతీ నెలా 30 సెలవులు జమ అయితే 10 ఏళ్లలో 300 నిల్వ చేరుకుంటుంది. ఆ తరువాత సెలవు పెట్టుకోవడం తప్ప నిల్వ చేసుకోవడం సాధ్యం కాదు. అలా అని సెలవులు లాప్స్ అయిపోతాయి అని ప్రతీ ఏడాది 30 రోజులు సెలవు పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు.
అందువల్ల ప్రతీ ఏడాది అవకాశం ఉన్న 15 రోజులు సరెండర్ చేసి నగదు తీసుకుంటూ ఉంటే, 300 నిల్వ చేరుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది. అక్కడ నుండి ప్రతీ ఏడాది సరెండర్ చేయగా మరో 15 సెలవులు ఏదో ఒక అవసరానికి వాడుకుంటూ ఉంటే గరిష్టంగా మన సెలవులను వాడుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఇలా చూసుకుంటే 30 ఏళ్లలో మనకు 900 సెలవులు లభిస్తాయి. రిటైర్మెంట్ నాటికి 300 ఉంచుకోవాలి కాబట్టి మిగిలినవి 600 సెలవులు. ప్రతీ ఏడాది 15 రోజులు సరెండర్ చేస్తూ వెళితే 300 సెలవులను సరెండర్ చేసుకోవడం ద్వారా నగదు పొందుతూ ఉండొచ్చు. ఇంకా మరో మూడు వందల సెలవులు మిగులుతాయి. ఇవి సర్వీస్ లో అవసరం అయినపుడు వాడుకోవచ్చు.