top of page
Writer's pictureAPTEACHERS

ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1964

Updated: Mar 3, 2024

ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్, 1964


ఈ నిబంధనలు హై కోర్ట్ జడ్జీలు, అఖిల భారత సర్విసుల ఉద్యోగులు, పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి,  విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కి, కంటింజెంట్ ఉద్యోగులకు మినహా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తాయి. 


  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఉన్నతాధికారుల నుండి ఏమైనా ప్రత్యేకమైన ఆదేశాలు ఉంటె మినహా తన విధి నిర్వహణ లో తనకు సంక్రమించిన అధికారాలను నిబంధనలను అతిక్రమించి ఉపయోగించకూడదు.

  • ఉన్నతాధికారుల ఆదేశాలు కనుక నిబంధనల కు విరుద్ధంగా ఉన్నట్లయితే తప్పని సరిగా రాత పూర్వక మైన ఆదేశాలు పొందవలెను.

  • ఉన్నతాధికారులు రాత పూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల లోనూ తిరస్కరించ కూడదు.     

రూల్ - 3 A

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి భారత దేశ సార్వ భౌమత్వానికి, సమగ్రత కి భంగం కలిగించే ఎలాంటి సంఘం లోనూ సభ్యత్వం కలిగి ఉండకూడదు. 

రూల్ - 3 B

ఏ ఉద్యోగి తన విధి నిర్వహణ లో 

  • అమర్యాద పూర్వక ప్రవర్తన కలిగి ఉండకూడదు.

  • ఉద్దేశ్య పూర్వకంగా ఆలస్యం చేయ కూడదు.

రూల్ - 3 సి

  • ఏ ఉద్యోగి తన విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేయకూడదు. ఉద్దేశ్య పూర్వకంగా తాకడం, లైంగిక వాంఛలు తీర్చాలని వేధించటం, అశ్లీల చిత్రాలు చూపడం, ఇతర ఇబ్బందికరమైన ప్రవర్తన కలిగి ఉండటం వంటివి చేయరాదు.

రూల్ - 3 (5)  


  • ఉన్నత స్థానం లో ఉన్న ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా తన క్రింద పని చేసే ప్రతీ ఉద్యోగి తన విధుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటానికి సాధ్యమైన చర్యలు చేపట్టాలి. ఎవరైనా ఉద్యోగి తరచుగా తనకు అప్పగించిన విధులు సకాలంలో పూర్తి చేయడం లో విఫలం అవుతూ ఉంటె అతనికి తన విధుల పట్ల శ్రద్ధ లేదని భావించాలి. 

రూల్ - 3 (6) 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా 14 లోపు ఉండే పిల్లల చేత ఎలాంటి పనులు చేయించుకోకూడదు.

రూల్ - 4 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి సమ్మెలు, లేదా  ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, నిరాహార దీక్షలు చేయటం, జీతం తీసుకోవడానికి నిరాకరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

రూల్ -5

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి దేశ సార్వభౌమత్వానికి లేదా సమగ్రతకు భాగం కలిగించే ఎలాంటి ధర్నాలలో పాల్గొన కూడదు 

రూల్ - 6

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరి నుండీ బహుమతులు, సేవలు పొందరాదు. ఉద్యోగి గౌరవార్ధం ఏర్పాటు చేసే ఎలాంటి సన్మానాలను, వినోద కార్యక్రమాలను అంగీకరించరాదు. ప్రైవేటు వ్యక్తుల అతిధి గృహాలలో నివసించడం, శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవలలో రిబ్బన్ కటింగ్ వంటివి చేయరాదు.  

  • అయితే పళ్ళు, పూలు వంటివి; కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో గ్రూప్  ఫోటో లు తీసుకోవడం, వివాహాల వంటి వేడుకలలో  బంధువుల నుండి  స్నేహితుల నుండి రూ.200 లోపు విలువైన బహుమతులను స్వీకరించవచ్చు.   

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉద్యోగి కుటుంబ సభ్యులు కానీ విదేశాల నుండి రూ.10,000 కన్నా విలువైన నగదు లేదా వస్తువులు అందుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియ పరచాలి. 

రూల్ - 7

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ముందస్తు ప్రభుత్వ అనుమతి ఉంటె తప్ప ఎటువంటి చందాలు వసూలు చేయకూడదు 

రూల్ - 8

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి వడ్డీకి  అప్పులు తీసుకోవడం కానీ చేయడం కానీ చేయకూడదు. 

  • బంధువుల వద్ద నుండి లేదా స్నేహుతుల నుండి స్వల్ప మొత్తం లో వడ్డీ లేని చేబదుళ్లు తీసుకోన వచ్చును.  బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు పొందవచ్చును.

  • వడ్డీకి అప్పులివ్వడం అనేది ఉద్యోగి యొక్క అవిభాజ్య హిందూ కుటుంబం యొక్క వారసత్వ వ్యాపారం అయినట్లయితే అది ఉద్యోగి పని చేసే జిల్లాలో లేనట్లయితే కొనసాగించ వచ్చును. అయితే ఈ వ్యాపార కార్యకలాపాలలో ఉద్యోగి పాల్గొన కూడదు.  

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి దివాలా తీసే పరిస్థితులకు అవకాశం ఇవ్వకూడదు.

రూల్ - 9 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి మరియు అతని కుటుంబ సభ్యులు  ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి స్థిరాస్తులు లేదా లక్ష రూపాయలకు పైబడిన చరాస్తులు కొనుగోలు చేయటం, అమ్మడం చేయకూడదు. 

  • ఎవరి నుండి కొంటున్నారు? లేదా ఎవరికీ అమ్ముతున్నారు? కొనడానికి అవసరమైన ఆర్ధిక వనరుల వివరాలు తెలియ పరుస్తూ ముందస్తు అనుమతి పొందాలి.

  • అనుమతి కోసం దరఖాస్తు చేసిన నెల గడచినా కూడా అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగా భావించి కొనుగోళ్ళు, అమ్మకాలు చేయవచ్చు. 

  • ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వేలం పాటల్లో పాల్గొన కూడదు.

  • నాల్గవ తరగతి సిబ్బంది మరియు రికార్డ్ అసిస్టెంట్ లు మినహా మిగిలిన అందరు ఉద్యోగులు ఉద్యోగంలో చేరిన వెంటనే ఉద్యోగి పేరిట మరియు ఉద్యోగి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలు సమర్పించాలి. 

  • ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి ప్రతీ సంవత్సరం జనవరి 15 లోపు గత సంవత్సరంలో కొనుగోలు, అమ్మకాలు చేసిన, సంక్రమించిన స్థిర చరాస్తుల వివరాలు సమర్పించాలి. 

 రూల్ - 10 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. 

  • ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాపార కార్యకలాపాలు నిరహిస్తున్నట్లయితే ప్రభుత్వానికి తెలియ పరచాలి.

రూల్ - 11

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి కంపనీలు స్థాపించడం, భాగస్వామ్యం కావడం, నిర్వహించడం, ప్రమోట్ చేయడం చేయ కూడదు. 

రూల్ - 12

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభుత్వ విధులు మినహా ప్రైవేటు ఉద్యోగం, లేదా ఇతర కార్యకలాపాల్లో ఉండకూడదు.  

రూల్ - 13 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ముందస్తు ప్రభుత్వ అనుమతి లేకుండా సాంకేతిక, సాహిత్య, కళాత్మక ధోరణి లేని ఎలాంటి పుస్తకాలు ప్రచురించ రాదు.

రూల్ - 14

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎటువంటి అధికారిక పత్రాలని, సమాచారాన్ని కానీ, సంబంధం లేని ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు వ్యక్తులకు లేదా ప్రెస్ కానీ అందజేయకూడదు.   

  • అయితే సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినపుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

రూల్ - 15

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ఏ ప్రెస్ కార్యకలాపాల్లో సంబంధం కలిగి ఉండకూడదు.  

రూల్ - 16

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాల్లో పాల్గొన కూడదు. పత్రికల్లో ఆర్టికల్స్, పీరియడికల్స్ వంటివి ప్రచురించకూడదు.  

రూల్ - 17

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధానపర నిర్ణయాలను లేక చర్యలను విమర్శించ రాదు. 

  • అయితే కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉండే ప్రైవేట్ సమావేశాలు లేదా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో వారికి ఉద్యోగులకు సంబంధించిన అంశాల పై చర్చించవచ్చు.

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలకు గానీ కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర విదేశీ ప్రభుత్వ సంబంధాల కు ఇబ్బంది కలిగే విధమైన ప్రకటనలు చేయరాదు. 

రూల్ - 18

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ కమిటీ లేదా కమీషన్ ముందు కానీ సాక్ష్యం ఇవ్వరాదు.

  • కోర్టు విచారణలు మరియు శాఖ పరమైన విచారణ లలో సాక్ష్యం ఇవ్వవచ్చు.

రూల్ - 19

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏ రాజకీయ పార్టీలలోనూ సభ్యత్వం కలిగి ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేయటం కానీ వాటి కార్యకలాపాల్లో పాల్గొనటం కానీ చేయకూడదు.

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా రాజకీయ పార్టీ కార్య కలాపాలలో పాలు పంచుకోకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబ సభ్యులను నిరోధించలేనిచో ప్రభుత్వానికి సమాచారమివ్వాలి.

  • ప్రభుత్వ ఉద్యోగి తనకు నచ్చిన విధంగా తన వోటు ని వినియోగించు కోవచ్చు. కానీ, ఎక్కడ బహిరంగ పరచకూడదు. 

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తనకు చెందినా వస్తువులు, ఇల్లు, వాహనాలు తనకు చెందిన ఏ ప్రదేశంలో ఏ ఎన్నికల గుర్తులు లేదా పార్టీ గుర్తులు ప్రదర్శించ కూడదు. 

రూల్ - 20

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన చర్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదు . మీడియా లో ప్రకటనలు ఇవ్వకూడదు 

రూల్ - 21

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా సమీప బంధువులు ఎవరైనా అ ఉద్యోగి క్రింద లేదా సహోద్యోగి గా పని చేయుచున్నట్లయితే ప్రభుత్వానికి తెలియ పరచాలి.

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే తన కుటుంబ సభ్యుల లేదా సమీప బంధువులైన అధికారుల క్రింద పని చేయ వలసి వస్తే యా విషయాన్నీ ప్రభుత్వానికి తెలియ పరచాలి. 

రూల్ - 22

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అయిన తన కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ప్రభుత్వంతో కానీ, సంబంధిత శాఖతో కానీ, కార్యాలయం తో కానీ సంబంధం ఉన్న వ్యక్తులు లేదా సంస్థల లో ఉపాధి పొంద దలచినట్లయైతే  ప్రభుత్వానికి తెలియ పరచాలి.

రూల్ - 23

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక హోదాతో తన కుటుంబ సభ్యుల లేదా సమీప బంధువుల  వ్యవహారాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షం గా కానీ డీల్ చేయరాదు. 

రూల్ - 24

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి అతని ప్రయోజనం  కోసం  పై అధికారులపై ఎలాంటి వత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేయరాదు. ప్రజా ప్రతినిధుల నుండి కానీ, నేరుగా అత్యున్నత స్థాయి అధికారుల నుండి కానీ సిఫార్సులు లేదా వత్తిడి తీసుకు రాకూడదు.

  • ఎలాంటి విజ్ఞాపన పత్రాలు తన తదుపరి స్థాయి అధికారి ద్వారా కాకుండా నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం లేదా లేఖలు రాయటం చేయరాదు. 

రూల్ - 25

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి జీవించి ఉన్న భార్య ఉండగా, భార్య అనుమతి లేకుండా మరో వివాహం చేసుకోకూడదు. 

  • ఏదేని పర్సనల్ లా బహు భార్యత్వానికి అవకాశం కల్పిస్తున్నా కూడా,  మొదటి భార్యతో విడాకులు పొంది లేదా తలాక్ చెప్పి మొదటి భార్యకు సమాచారం ఇచ్చిన తరువాత మాత్రమే రెండవ వివాహం చేసుకోవచ్చును.

  • వివాహం కాని, భర్త చనిపోయిన లేదా భర్తతో విడాకులు పొందిన ఏ మహిళా ఉద్యోగి కూడా భర్య బ్రతికి ఉన్న ఏ వ్యక్తిని అతని మొదటి భార్య అనుమతి పొందకుండా వివాహం చేసుకోరాదు.

రూల్ - 25 A

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కట్నం ఇవ్వటం కానీ తీసుకోవడం కానీ చేయరాదు

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు ప్రత్యక్ష్యం గా కానీ, పరోక్షంగా కానీ కట్నం కొరకు వత్తిడి చేయకూడదు. 

రూల్ - 26

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణ లో ఉండగా మద్యం లేదా ఇతర మత్తు పదార్ధాలు (డ్రగ్స్) తీసుకోరాదు. మద్యం మత్తులో ఉండరాదు.

  • ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం మత్తులో సంచరించరాదు.

  • మోతాదుకు మించిన మద్యం సేవించరాదు

11 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page