జగనన్న విద్యా కానుక - కిట్ల పంపిణీ కి HM లకు ,MEO లకు తాజా మార్గదర్శకాలు Rc No 16021
విషయం : సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో- ఆర్డినేటర్లకు, సమగ్ర శిక్షా సీఎంవోలకు, అసిస్టెంట్ సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC -SSA తేది: 14 -08-2020
నిర్దేశములు:
1. ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC -SSA తేది: 16 -07-2020
2. ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC -SSA తేది: 17-07-2020
3. ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC -SSA తేది: 30-07-2020
ఆదేశములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్ధులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక' పేరుతో ప్రతీ విద్యార్థికి పలు వస్తువులతో ఒక కిట్ అందించబోతున్న విషయం తెలిసిందే. ఈ కిట్లను రూపొందించే కార్యక్రమం కోసం అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు, సమగ్రశిక్షా సీఎంవోలకు, అసిస్టెంట్ సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు దిగువ సూచనలు ఆదేశించడమైనది. అందరు అధికారులు గమనించవలసినవి:
1. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కిట్ లోని అన్ని అంశాల సరఫరా దాదాపు చాలా పాఠశాలల్లో జరుగుతూంది.
2. ఈరోజు నుంచి అన్ని అంశాలకు సంబంధించిన సరఫరా ఇంకా వేగవంతం అవుతుంది.
3. 13.8.2020వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు, పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు గార్లు జరిపిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వెంటనే అన్ని రకాల అంశాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అప్పగించవలెను.
4. ప్రధానోపాధ్యాయులు వాటిని కిట్లగా రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలి.
5. ఇందుకు సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో- ఆర్డినేటర్లు, సీఎంవోలు, ఇతర జిల్లా సెక్టోరియల్ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు అందరు ప్రధానోపాధ్యాయుల కోసం ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించి, పూర్తి స్థాయిలో వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు చూపుతూ సహకరించాలి.
6. మండల రిసోర్సు కేంద్రాలకు (MRC)వచ్చిన వస్తువులను పాఠశాల వారీగా మండల విద్యాశాఖ అధికారులు (MEO) పంపిణీ చేయాలి.
7. అన్ని అంశాలతో కూడిన కిట్ రూపకల్పన ఆ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కలిసి పూర్తి చేయాలి.
8. 'మన బడి:నాడు-నేడు' పనులు కారణంగానో లేదా మరే ఇతర కారణాల వల్లయినా ఏ పాఠశాలలోనైనా సరైన సౌకర్యాలు లేకపోతే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు.
9. మండల రిసోర్సు కేంద్రాల (MRC) నుంచి పాఠశాలలకు కిట్ లోని అంశాలుచేర్చేందుకు అయ్యే రవాణా ఖర్చులను అవసరమైన మేరకు సమగ్ర శిక్షా భరిస్తుంది. ఈ మొత్తాన్ని పాఠశాల కాంపోజిట్ నిధుల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. (DPO, SMC, CRC, MRCలకు చెందిన ఆంధ్రాబ్యాంకు ఖాతాలనిల్వ వివరాలు జతపరచడమైనది).
10. ముఖ్యంగా గమనించవలసినది.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలి. 11. జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ప్రతి రోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి.
12. ముఖ్యంగా రాష్ట్ర కార్యాలయం నుంచి కానీ, గౌరవ విద్యాశాఖామంత్రి వారి కార్యాలయం నుంచి కానీ, గౌరవ ముఖ్యమంత్రి వారి కార్యాలయం నుంచి కానీ ఏ అధికారి ఎప్పుడు ఫోన్ చేసి ఆ జిల్లా సంబంధించిన కిట్ లోని అన్ని అంశాల సరఫరా గురించి,కిట్ల రూపకల్పన గురించి సమాచారాన్ని అడిగితే జిల్లా అధికారులు ఎటువంటి తడబాటు లేకుండా వెంటనే చెప్పగలిగే విధంగా సన్నద్ధమై ఉండాలి.
రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో- ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.
Click here to download proceedings ⬇️