top of page

విజయవంతంగా వీసా !విదేశీ విద్య!

విజయవంతంగా వీసా!

విదేశాల్లో అడుగు పెట్టేందుకు ఆ దేశం అందించే అధికారిక అనుమతి పత్రం వీసా. చదువుకోడానికి వెళ్లే విద్యార్థులకూ ఇది తప్పనిసరి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసుకున్నప్పటికీ వీసా దొరక్కపోతే విదేశీ నేలపై కాలు పెట్టలేరు. సంబంధిత సర్టిఫికెట్లను పరిశీలించడంతోపాటు అక్కడికి ఎందుకు వెళుతున్నారనే అంశాల గురించీ అధికారులు స్పష్టంగా తెలుసుకుంటారు. ఏ మాత్రం అసంతృప్తి అనిపించినా తిరస్కరిస్తారు. అందుకే ఈ ప్రక్రియ అందరినీ కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఎలాంటి కంగారు లేకుండా సాఫీగా వీసా దశ విజయవంతంగా సాగిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

విజయవంతంగా వీసా!

విదేశీ విద్య కోసం చేసే సన్నాహాల్లో కీలకమైనదీ, ఎక్కువ ఒత్తిడికి గురిచేసేదీ వీసా. పరీక్షలు, ధ్రువపత్రాలు, ఇంటర్వ్యూ.. అనుమతి మంజూరులో భాగంగా ఉంటాయి. ఇలా దరఖాస్తు చేసి.. అలా విమానం ఎక్కేయవచ్చు అనుకుంటున్నారేమో.. అదంత తేలిక కాదు. ఈ ప్రక్రియలోని ప్రతి అవసరాన్నీ, విధానాలనూ స్థూలంగా తెలుసుకోవాలి. లేదంటే కోరుకున్న దేశంలో అడుగుపెట్టడం కష్టమైపోతుంది. ఒక్కోసారి ఎంచుకున్న కోర్సులో ఆలస్యంగా చేరాల్సి వస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా తిరస్కరణ ఎదురవుతుంది. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

ఇవి సిద్ధమా!

విజయవంతంగా వీసా!

వీసా దరఖాస్తు ప్రక్రియ మొత్తం అవసరమైన పత్రాలను సమర్పించడంపైనే ఆధారపడి ఉంటుంది. విద్యార్థి సంబంధిత విషయాలను అవే ధ్రువపరుస్తాయి. అందుకే వీటిని సిద్ధం చేసుకోవాలి.

పాస్‌పోర్ట్‌: ఇది ప్రాథమిక పత్రం. చెల్లుబాటులో ఉండాలి. ఎంతకాలం అనేది దేశాన్నిబట్టి మారుతుంది. దీన్ని ముందుగానే గమనించుకోవాలి. కొన్ని దేశాలు విద్యార్థి ఎంచుకున్న దేశంలో విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా ఉంటే చాలనుకుంటుంటే, మరికొన్ని విద్యార్థి విద్యాభ్యాసం పూర్తయ్యే సమయానికి మించి ఉండాలని కోరుతున్నాయి. వీసా స్టాంపింగ్‌ సమయానికి పాస్‌పోర్టులో కనీసం 3-4 పేజీలైనా ఖాళీ ఉండేలా చూసుకోవాలి.

ఆక్సెప్టెన్స్‌ లెటర్‌: దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయం కోర్సులో చేరడానికి విద్యార్థికి అనుమతిస్తూ అందించే పత్రం ఇది. ఈ ప్రక్రియలో దీనికి ప్రాముఖ్యం ఎక్కువ.

బోనఫైడ్‌: అభ్యర్థి విద్యార్థే అని రుజువు చేసుకోడానికి స్టూడెంట్‌ బోనఫైడ్‌ను సమర్పించాలి. దీన్ని ఎంచుకున్న దేశంలో దరఖాస్తు చేసుకున్న విద్యాసంస్థ నుంచి పొంది ఉండాలి. గత విద్యార్హతలకు సంబంధించిన పత్రాలనూ జోడించాలి.

ఆర్థిక వివరాలు: చాలావరకూ దేశాలు కోర్సు వ్యవధిలో ట్యూషన్‌ ఫీజు, కళాశాల, వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి తగినన్ని నిధులు విద్యార్థి దగ్గరున్నాయో లేదో చూస్తాయి. ఆర్థికంగా తగిన శక్తి ఉందని రుజువు చేసే పత్రాలను దగ్గర ఉంచుకోవాలి.

మెడికల్‌ రిపోర్ట్‌: తమ దేశంలోకి అడుగుపెట్టే విద్యార్థులు నిర్ణీత మెడికల్‌ టెస్టులు చేయించుకొని ఉండాలని చాలా దేశాలు కోరుతున్నాయి. ఇతర దేశాల్లోని జబ్బులు తమ పౌరులకు సోకకుండా చూడటమే దీని ఉద్దేశం. ఇందుకోసం విద్యార్థి తాను ఆరోగ్యంగా ఉన్నానని నిరూపించుకోవడానికి తగిన రిపోర్టులు సమర్పించాలి.

భాషా ప్రావీణ్యం: ఏ దేశానికి వెళ్లినా స్థానికులతో సంభాషించడానికి సాయపడేది అక్కడి భాషే. చాలావరకూ మన విద్యార్థుల ప్రాధాన్యం ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాలే కాబట్టి, ఆ భాషలో మాట్లాడటం, రాయడంలో ప్రావీణ్యాన్ని సంపాదించి ఉండాలి. అందుకు తగిన ధ్రువపత్రాలను పొందాలి. పలు దేశాలు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, పీటీఈ స్కోర్లను కోరుతున్నాయి. వీటిల్లోనూ ఎంచుకున్న దేశం దేన్ని పరిగణనలోకి తీసుకుంటోందో ముందే తెలుసుకోవాలి.

ఉదాహరణకు యూఎస్‌ టోఫెల్‌కు ప్రాధాన్యమిస్తుంది. యూరప్‌ దేశాలు ఐఈఎల్‌టీఎస్‌ను అడుగుతున్నాయి. జర్మనీ వెళ్లాలంటే స్థానిక భాష తెలిసి ఉండాలి.

సరిచూసుకొని సమర్పించాలి

విజయవంతంగా వీసా!

ఏ దేశానికి దరఖాస్తు చేసుకున్నా ధ్రువపత్రాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉండటం తప్పనిసరి. వేరే భాషలో ఉన్నవాటిని తర్జుమా చేయించి, అధికారిక ధ్రువీకరణ పొందాలి. కొన్ని కాన్సులేట్లు ఈ ట్రాన్స్‌లేషన్‌ సర్వీసులతోపాటు, అధికారిక సంతకాలనూ అందిస్తున్నాయి. వీటిని వీసా దరఖాస్తుకు ముందే పూర్తిచేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ ముందుగా చెక్‌ చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించేటప్పుడు అవసరమైన పత్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అడిగిన వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా వీసా తిరస్కరణకు గురవుతుంది. మొత్తం ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మరోసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి రావచ్చు. పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోల నుంచి ధ్రువపత్రాల వరకూ అన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని సమర్పించాలి.

వీసా ప్రక్రియలో ఇచ్చిన ధ్రువపత్రాల ఫొటో కాపీలను తీసి ఉంచుకోవాలి. వీసా మంజూరు కాగానే కాన్సులేట్‌ వారు ఒరిజినల్స్‌ తిరిగి ఇచ్చేస్తారు. అన్నీ వెనక్కి వచ్చాయో లేదో చూసుకోడానికి ఈ కాపీలు సాయపడతాయి. డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉంచుకుంటే ప్రయాణంలోనూ ఉపయోగపడతాయి.

వీసా ప్రక్రియలో పలుమార్లు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కొన్ని దేశాలు ఆన్‌లైన్‌లో కట్టమంటాయి. మరికొన్ని వ్యక్తిగతంగానూ చెల్లించమని అడగవచ్చు. ఆ వివరాలను ముందుగా తెలుసుకొని ఉండాలి. కోరిన వెంటనే కట్టగలిగే విధంగా అకౌంట్‌లోనూ, చేతిలోనూ డబ్బు ఉంచుకోవాలి. వీసా ఇంటర్వ్యూ సమయంలో అప్పటికప్పుడు ఏటీఎంల కోసం పరుగెత్తడం ఇబ్బందిగా ఉంటుంది.

ఎప్పుడు మొదలుపెట్టాలి?

వీసా ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఎంత వ్యవధిలోగా పూర్తవుతుందనేది అభ్యర్థి పరిధిలో ఉండదు. అనుకున్న సమయంలోగా అన్నీ జరగకపోతే ఎంచుకున్న దేశానికి వెళ్లడం సాధ్యంకాదు. కొన్ని తరగతులను కోల్పోవాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తవడానికి ఇంత సరాసరి సమయం పడుతుందని కొందరు చెప్పినప్పటికీ అప్పుడప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని నెలల ముందు నుంచే వీసా ప్రయత్నాలు ప్రారంభించాలి. ముందే దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన త్వరగా ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉండదు. అనుమతి అందడం అనేది ఎంచుకున్న ప్రోగ్రామ్‌ ప్రారంభ సమయంపై ఆధారపడి ఉంటుంది. చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవడమే మేలు.

సూటిగా.. స్పష్టంగా!

విజయవంతంగా వీసా!

ఏవో కొన్ని దేశాలు మినహా చాలావరకూ వీసా ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుంది. ముఖాముఖి అనగానే చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. అన్ని పత్రాలు సరిగా ఉండి, ఫీజులు సక్రమంగా చెల్లిస్తే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ సమయంలో అడిగే ప్రశ్నలకు స్పష్టంగా, సూటిగా సరైన సమాధానం ఇవ్వాలి. సహనంతో పద్ధతిగా మెలగాలి. అభ్యర్థుల కోసం తరచూ అడిగే ప్రశ్నలు కొన్ని..

* ఈ ప్రోగ్రామ్‌ను ఎందుకు ఎంచుకున్నారు?

* ఈ విశ్వవిద్యాలయం ఎంచుకోవడానికి కారణమేంటి?/ విశ్వవిద్యాలయం ప్రత్యేకతలేంటి?

* ప్రోగ్రామ్‌ ప్రత్యేకతలేంటి? ఎంత సమయంలో పూర్తవుతుంది? అదనంగా ఇస్తున్న అవకాశాలేంటి?

* భవిష్యత్‌ లక్ష్యాలేంటి?/ ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక ఏం చేద్దామనుకుంటున్నారు?

ఇవన్నీ చాలా ప్రాథమికమైన, కనీస ప్రశ్నలు. వీటికి స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. తగిన అవగాహన ఉంటే తడబడకుండా చెప్పటం సాధ్యమవుతుంది. జవాబులు ఎలా చెప్పాలో ముందే సిద్ధమవటం మంచిది.

9 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page